రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కిందిస్థాయి గాలులు నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయన్నారు.
మోస్తరు వర్షం...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో 15 నిమిషాలు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయ్యాయి. అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్బండ్లలో వర్షం కురిసింది.
ఏపీలోను వర్షాలు...
ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
ఇదీ చూడండి: HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'