Warehouse Corporation Chairman Saichand passed away : తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ హఠాన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన ఆయన బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు నాగర్‌కర్నూల్‌లోని ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవటంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సాయిచంద్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. సాయిచంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న వేద వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించిన సాయిచంద్.. ఎన్నో కష్టాలకోర్చి హైదరాబాద్‌లో పీజీ వరకు చదువుకున్నారు. పీడీఎస్‌యూలో ఉంటూ అరుణోదయ కళాకారుడుగా పనిచేశాడు.
- రాతిబొమ్మలను తన పాటతో కదిలించిన.. సాయిచంద్ గురించి ఈ విషయాలు తెలుసా..?
- KTR Emotional Video : ఎమోషనల్ అయిన కేటీఆర్.. సాయిచంద్‌ను తలుచుకుంటూ కంటతడి
Saichand last rites : ఈ క్రమంలోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి తన ఆటాపాటలతో ఉర్రూతలూగించే వారు. ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొన్న సాయిచంద్ తన కళాప్రదర్శనలతో ఆనాటి ఉద్యమనేతలను ఆకర్షించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉద్యమకాలం నుంచి నేటి వరకు సాయిచంద్ ఆటాపాట లేని కేసీఆర్ సభ దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ పోరాటంలో ఉద్యమస్ఫూర్తిని రగిలించటమే కాకుండా స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఆటాపాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో కృషి చేశాడు.
ఈ నేపథ్యంలోనే 2021 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. సాయిచంద్ మృతితో సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు, వివిధ పార్టీల నాయకులు, ఉద్యమ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కడసారి చూపు కోసం హైదరాబాద్ శివారులోని సాయిచంద్ నివాసానికి బీఆర్‌ఎస్ సహా ఇతర పార్టీల నేతలు, కళాకారులు, అభిమానులు, ఉద్యమ సహచరులు బారులు తీరారు. పార్థివ దేహానికి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శోకసంద్రంలో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చుతూ భావోద్వేగానికి గురయ్యారు.
కేసీఆర్ ఎదుట సాయిచంద్ భార్య, తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. వారికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. సాయిచంద్ పార్థివదేహానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి, తలసాని, సబిత, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, భారాసతో పాటు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, గద్దర్ సాయిచంద్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
BRS leader Saichand passed away : తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పలువురు సహచరులు కన్నీటిమున్నీరయ్యారు. తన గాత్రంతో తెలంగాణ ప్రజలను కదిలించిన సాయిచంద్ మరణం తమకు తీరని లోటని మంత్రి కేటీఆర్ సహా మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం అభిమానుల అశ్రనయనాల మధ్య, కళాకారుల ఆటాపాటలతో సాయిచంద్ అంతిమ యాత్ర సాగగా.. హైదరాబాద్ వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇవీ చదవండి: