విద్యారంగ భాగస్వాములనుండి సూచనలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం ఏ సూచనలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి పేర్కొన్నారు. సుమారు రెండున్నర లక్షల సూచనలు వచ్చాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని పరిగణనలోకి తీసుకలేదని ఆరోపించారు. ఐదవ తరగతి వరకు మాతృభాష నిర్భంధమా, ఐచ్ఛికమా స్పష్టత లేదని, దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. 3,5, 8 తరగతులలో పరీక్షలు నిర్వహించటం పరోక్షంగా డిటెన్షన్ విధానాన్ని అమలు జరపటమే అని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి విద్యను ఆరవ తరగతి నుండే ప్రారంభించటం ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వర్గాల విద్యార్థులను సాధారణ విద్యకు దూరం చేస్తుందని వారు వివరించారు. సెకండరీ స్థాయిలో మాత్రమే వృత్తి విద్యను ప్రారంభిస్తే చదువు ముగిసిన అనంతరం ఉపాధిని పొందే అవకాశం ఉంటుందని, అన్ని స్థాయిల పాఠశాలల్లో ఒకే రకంగా 1:30 ఉండటం సమంజసం కాదన్నారు. ప్రీ ప్రైమరీలో 1:10, ప్రైమరీలో 1:20, సెకండరీ విద్యలో 1:30 గా ఉండాలని, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పాఠశాల మొత్తానికి కాకుండా తరగతి వారీగా ఉండాలని, ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండాలనే సూచనలను సైతం పట్టించుకోలేదన్నారు.
ఉన్నత విద్యలో విదేశీ విశ్వ విద్యాలయాలు, ప్రైవేటు కళాశాలలకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం కల్పించే దిశగా ఎన్ఈపీ ఉన్నదని వారు చెప్పారు. 3 నుండి 18 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడం, మధ్యాహ్న భోజనంతో పాటు.. అల్పాహారాన్ని అందించాలనే నిర్ణయాలను స్వాగతిస్తామన్నారు. 5+3+3+4 విధానం ఆహ్వానించదగిందని, అయితే జిడిపిలో 6% విద్యకు కేటాయించాలనే జాతీయ విద్యాకమీషన్(కొఠారి కమిషన్) సూచన గత 52 సంవత్సరాలుగా అమలుకు నోచుకోలేదన్నారు. మరలా అదే ప్రతిపాదించారనీ, ఈ ప్రతిపాదనలు ఆచరణాత్మకం కాకపోతే.. ప్రయోజనం లేదని టిఎస్ యూటీఎఫ్ భావిస్తుందన్నారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'