Pariksha Pe Charcha 2023: పరీక్షా పే చర్చలో రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంకు చెందిన అక్షర బహు భాషలపై పట్టు సాధించేందుకు.. ఎలాంటి కృషి చేయాల్సి ఉందని మోదీని వివరించాలని కోరింది. దేశంలో అతి ప్రాచీన భాష తమిళ్ అని అక్షర ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ.. కార్మికులు నివసించే బస్తీలోని ఒక చిన్నారిని ఉదాహరణగా చెప్పారు. 8 ఏండ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళ్ మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
బస్తీలో నివసించే 8 ఏండ్ల చిన్నారి అన్ని భాషలు ఎలా మాట్లాడటం ఎలా సాధ్యమైందో తెలుసుకున్నానని అన్నారు. ఆమె అన్ని భాషలు మాట్లాడేందుకు కారణం ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వారు.. ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని వివరించారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడంతో వారితో నిత్యం మాట్లాడుతూ ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుందని తెలిపారు. అన్ని భాషలు నేర్చుకునేందుకు ఆ చిన్నారి చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు. మల్టిపుల్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదని.. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంలో పలువురు విద్యార్థులు ప్రధాని మోదీని ప్రశ్నించారు. అందుకు ప్రధాని సైతం ఓపికగా సమాధానమిచ్చారు. చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో తెలుస్తుందని విద్యార్థులకు మోదీ సూచించారు.
ప్రధానిజీ.. హార్డ్ వర్క్ లేక స్మార్ట్ వర్క్..?: స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్’ఏదీ ముఖ్యమైంది సర్ అంటూ ప్రధానిని ఓ విద్యార్థి ప్రశ్నించారు. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’అని ఆయన చమత్కరించారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, దానికి తగ్గట్టే పనిచేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఇవీ చదవండి: పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి
శరవేగంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు
'అమ్మను చూస్తే సమయపాలన ఎలా చేయాలో తెలుస్తుంది'.. పరీక్ష పే చర్చలో విద్యార్థులతో మోదీ