''ఓ ఆస్పత్రికి వెళ్తే.. వైద్యుడు రాసి ఇచ్చిన చీటీలోని మెడిసిన్.. ఆ ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ స్టోర్‌లోనే దొరుకుతుంది. మరెక్కడా అది దొరకదు. తీరా అక్కడే ఔషదాలు తీసుకుందామని చూస్తే.. దాని ధరను చూసి బాధితుడికి మరో రోగం రావాల్సిందే. ఇలా బ్రాండ్ల పేర్లతో దోచుకుంటున్న వైద్యులకు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి పలు సూచనలు చేసింది. మందుల చీటీలో జనరిక్ పేర్లతోనే ఔషదాలు రాయాలని.. బ్రాండ్లపేర్లతో రాయకూడదని సూచించింది.''
Generic Medicine: మందుల చీటీలో ఔషధాలను తప్పనిసరిగా జనరిక్ పేర్లతోనే రాయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ల పేర్లతో ఔషధాలను రాయకూడదని సూచించింది. ఈ విషయంపై ఇప్పటికే భారతీయ వైద్య మండలి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని గుర్తుచేసింది. ఇదే అంశంపై ఇటీవల లోకాయుక్త కూడా ఆదేశాలిచ్చిందని పేర్కొంది. ‘భారతీయ వైద్య మండలి, లోకాయుక్త ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ కొందరు వైద్యులు బ్రాండ్ల పేర్లతోనే చీటీలు రాస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇక మీదట ఇలాంటివి సహించం. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులందరూ ఇకపై జనరిక్ పేర్లతోనే ఔషధాలను రాయాలని’ స్పష్టంచేస్తూ టీఎస్‌ఎంసీ రిజిస్ట్రార్ సీహెచ్.హనుమంతరావు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ చూడండి: generic medicine : మందుల ఖర్చు తడిసి మోపెడు.. జనరిక్‌తోనే విరుగుడు