Telangana State Anti Narcotics Bureau : తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మత్తుమందుల దందాను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. సైబర్ నేరాల నియంత్రణకు ‘తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ మత్తుమందులకు అడ్డుకట్ట వేసేందుకు ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో’ ఏర్పాటు చేయబోతోంది. ఈ విభాగాలకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండింటితో పాటు రాజధాని పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు అదనపు సిబ్బందిని మంజూరు చేశారు.
మొత్తంగా 3 వేల 966 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంపై సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే సంవత్సరానికి దాదాపు రూ.వంద కోట్లకు పైగా కొల్లగొడుతున్నారు. తెలంగాణలో సగటున ఏడాదికి పది వేలకుపైగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ నేరాలు ఇప్పుడు గ్రామాలకూ విస్తరించాయి. దాంతో ఎక్కడికక్కడ స్థానిక పోలీసులే కేసులు నమోదు చేసేలా ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
పోలీసులకు ప్రత్యేక శిక్షణ: అందుకు తగ్గట్టుగానే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అయినప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. భవిష్యత్తులో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర, రాష్ట్ర హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్ముందు సైబర్ దాడులు పెరిగే ముప్పు ఉందని హెచ్చరికలూ జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేలా పకడ్బందీ వ్యవస్థ ఉండాలని పోలీస్ శాఖ నిర్ణయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేయబోతోంది.
డ్రగ్స్ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు: రాష్ట్రంలో, రాష్ట్రం మీదుగా గంజాయి, డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. వినియోగమూ పెరిగిపోతోంది. అనేక సందర్భాల్లో ఈ విష సంస్కృతి తాలూకూ ఆనవాళ్లు బయటపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మత్తుమందులను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలోనే పలుమార్లు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఆబ్కారీ శాఖకు అనుబంధంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత జనవరిలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడినా ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో’ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీనికి 300 పోస్టులు మంజూరు చేశారు.వీటితోపాటు దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కొత్త పోస్టులు మంజూరు చేశారు.
కొత్త పోస్టులు మంజూరు : దీనికోసం ఒక డీఐజీ, ఇద్దరు ఎస్పీలు, అదనపు ఎస్పీ-4, డీఎస్పీ-6, సీఐ-12, ఎస్‌ఐ-12, ఏఎస్‌ఐ-5, హెడ్‌కానిస్టేబుళ్లు-15, కానిస్టేబుళ్లు-50, సాంకేతిక సిబ్బంది-25 మంది సహా మొత్తం 400 కొత్త పోస్టులు మంజూరు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌కు 1,252, సైబరాబాద్‌కు 751, రాచకొండకు 763 పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎందులో ఎంతమంది: ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ సీఐడీ తరహాలోనే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ముఖ్యమైన సైబర్ నేరాలు దీనికి బదిలీ చేస్తారు. ఈ విభాగంలో ఇద్దరు ఎస్పీలు, డీఎస్పీ-30, సీఐ-34, ఎస్సై-68, హెడ్‌కానిస్టేబుళ్లు-80, కానిస్టేబుళ్లు-188, సాంకేతిక నిపుణులు-52 మందితోపాటు కార్యాలయ సిబ్బంది సహా మొత్తం 500 మంది పనిచేస్తారు. ఈ మేరకు పోస్టులు మంజూరు చేశారు. ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో’లో నలుగురు ఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ, 15 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 39 మంది ఎస్‌ఐలు, 42 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 75 మంది కానిస్టేబుళ్లతోపాటు కార్యాలయ సిబ్బంది ఉంటారు.
ఇవీ చదవండి: