రాష్ట్రంలో గొర్రెల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా నచ్చిన చోట వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు వద్ద గల పశుభవన్‌లో రాష్ట్ర గొర్రెల పెంపకందార్ల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గొళ్ల, కురుమల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని రవీందర్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2 నెలల కిందట తిరిగి ప్రారంభించిన సర్కారు బడ్జెట్‌లో రూ.3000 కోట్లను కేటాయించిందని తెలిపారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు మళ్లీ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 వేల మంది డీడీలు తీసి మూడేండ్లుగా వేచిచూస్తున్నారన్న ఆయన గతంలో ఇచ్చిన యూనిట్లలో సీపీటీలు, పశువైద్యులు దళారీలతో కుమ్మక్కై, యూనిట్‌కు 21 గొర్రెలకు బదులు 9 నుంచి 13 వరకే పంపిణీ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కరోనా థర్డ్ వేవ్ పట్ల ఆందోళన అవసరం లేదు: డీహెచ్