Telangana New Secretariat: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా మూడు షిఫ్టులో పనుల్లో నిమగ్నమయ్యారు. నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులన్నీ పూర్తికాగా అంతర్గత సహా ఇతరత్రా పనులు కొనసాగుతున్నాయి. అన్ని రకాల పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. సచివాలయ పనుల పర్యవేక్షణలో ఉన్న ఓ ఇంజినీర్ మాటల్లో చెప్పాలంటే.. సివిల్ ఇంజినీరింగ్‌లో ఏ ఏ పనులు ఉంటాయో ఆ పనులన్నీ ప్రస్తుతం సచివాలయ నిర్మాణంలో కొనసాగుతున్నాయి.
భవనం పైన మొత్తం 34 గుమ్మటాలను ఏర్పాటు చేశారు. రెండు భారీ గుమ్మటాల కాంక్రీట్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో వాటిపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు. భవనం ముందువైపు ఉన్న భారీ గుమ్మటంపై నిన్న జాతీయ చిహ్నాన్ని అమర్చారు. భారీ క్రేన్ సహాయంతో చిహ్నాన్ని కింది నుంచి గుమ్మటం పైకి తీసుకెళ్లి అమర్చారు. ఐదు టన్నుల బరువు ఉండే ఈ కాంస్య చిహ్నాన్ని దిల్లీలో ప్రత్యేకంగా సిద్ధం చేయించారు.
కొనసాగుతున్న అంతర్గత పనులు: జాతీయ చిహ్నం ఎత్తు 18 అడుగులు. భవనం, గుమ్మటం కలిపి ఇప్పటికే 258 అడుగుల ఎత్తు వచ్చింది. తాజాగా జాతీయ చిహ్నం కూడా ఏర్పాటు చేయడంతో మొత్తం పొడవు 276 అడుగులకు చేరుకుంది. భవనం వెనుక వైపు ఉన్న భారీ గుమ్మటంపై కూడా జాతీయ చిహ్నాన్ని నేడో, రేపో ఏర్పాటు చేయనున్నారు. భవనం లోపల అంతర్గత పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తు పనులపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆరో అంతస్తులు ఫ్లోరింగ్ కోసం ప్రత్యేక మార్బల్ వినియోగిస్తున్నారు. ఇతర పనులు కూడా వేగంగా చేస్తున్నారు.
పనుల పురోగతిపై నిత్యం ఆరా: సంక్రాంతి తర్వాత సచివాలయాన్ని ప్రారంభించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు ఇచ్చారు. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నారు. రహదారులు - భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సచివాలయ పనుల పురోగతిపై నిత్యం ఆరా తీస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి క్షేత్రస్థాయిలో సచివాలయ పనులను పరిశీలిస్తున్నారు. పురోగతిని ఆరా తీస్తూ ఇంజినీర్లు, గుత్తేదారుకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి భవనాన్ని సిద్ధం చేసే విషయమై అందరూ దృష్టి సారించారు. సచివాలయ భవనం చుట్టూ నిర్మిస్తున్న మసీదు, ఆలయం, కాంప్లెక్స్ పనులు కూడా వేగవంతమయ్యాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి: సంక్షేమ హాస్టళ్లలో పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్