KTR on Metro in TS Budget Sessions 2023 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు పద్దులపై చర్చ జరుగుతోంది. మెట్రో పనులు, జీహెచ్‌ఎంసీ అభివృద్ధి, నాలాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పాతబస్తీకి కచ్చితంగా మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.
KTR on Hyderabad Naalas : హైదరాబాద్‌లో రూ.985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ వివరించారు. కొన్ని పనులు పూర్తి కావడంతో.. ఎల్‌బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంత మేర తగ్గిందని స్పష్టం చేశారు.
KTR on Hyderabad Metro : హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం మోకాలడ్డుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలకు మెట్రో ఏర్పాటుకు కోట్ల నిధులు మంజూరు చేస్తూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు. మెట్రో టిక్కెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని ఇప్పటికే హెచ్చిరించినట్టు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు.
KTR on Oldcity Metro : మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనిదని కేటీఆర్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అంటే ఛార్మినార్ అని అందరికీ తెలుసునన్న మంత్రి.. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.
శుక్రవారం రోజున కేటీఆర్.. ఐటీ, చేనేత రంగాల్లో అభివృద్ధి గురించి మాట్లాడారు. శాసనసభలో రాష్ట్ర ప్రగతిని.. గూగుల్ మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని అన్నారు. 2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఆ సంఖ్య 8.70 లక్షలకు చేరిందని తెలిపారు. గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయిని.. 4.50 లక్షల ఉద్యోగాల్లో మన వాటా లక్షన్నర ఉద్యోగాలని వెల్లడించారు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటిందని.. సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్ పరిశ్రమ నెలకొల్పామని వెల్లడించారు.
'మేం స్టార్టప్ అంటున్నాం.. బీజేపీ ప్యాకప్ అంటోంది' అని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం రూ.12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వసంస్థల అమ్మకంతో బీసీ,ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ తర్వాత కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తామందని.. ఆ ప్యాకేజ్‌పై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?' అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.