Telangana Libraries: ‘80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలకు నిరుద్యోగ అభ్యర్థుల తాకిడి పెరిగింది. మేము కూడా అప్రమత్తమయ్యాం. వారికి అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం’ అని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ చెప్పారు. ఉద్యోగాల ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో గ్రంథాలయాల్లో సౌకర్యాలు, అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు- ఈటీవీ భారత్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నిరుద్యోగులు కోరినవి తెప్పిస్తాం...
రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతీయ, 33 జిల్లా గ్రంథాలయాలు సహా మొత్తం 573 లైబ్రరీలున్నాయి. వాటిలో 68.10 లక్షల పుస్తకాలున్నాయి. ఏటా 2.53 కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఇటీవల సీఎం ప్రకటన చేయగానే గ్రంథాలయాలకు వచ్చే నిరుద్యోగుల సంఖ్య, అక్కడ గడిపే సమయం బాగా పెరిగింది. ఒక్కో జిల్లా గ్రంథాలయంలో 11 రకాల దినపత్రికలతోపాటు మేగజైన్లు, జనరల్ స్టడీస్ లాంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమేం కావాలో లైబ్రరీల్లో ఉండే ఆన్ డిమాండ్ రిజిస్టర్‌లో రాస్తే 2-3 రోజుల్లో తెప్పిస్తాం. అందుకు ప్రతినెలా జిల్లా గ్రంథాలయం రూ.20 వేలు ఖర్చు చేయవచ్చు. వర్తమాన వ్యవహారాలు(కరెంట్ అఫైర్స్) తప్ప మిగిలిన సిలబస్ పాతదే కాబట్టి వాటికి సంబంధించిన పుస్తకాలు పెద్దగా అవసరం ఉండదు.
కొన్ని చోట్ల ఏసీ హాళ్లు..
అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు గ్రంథాలయాల్లో రీడింగ్ హాళ్లను అభివృద్ధి చేశాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాల్లో విశాలమైన ఆధునిక భవనాలు నిర్మిస్తున్నాం. నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబాబాద్‌లో భవనాలు పూర్తయ్యాయి. మరో అయిదు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్నాయి. పాత జిల్లా కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాలను ఆధునికీకరించి సౌకర్యాలు మెరుగుపరిచాం. కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్ తదితర చోట్ల ఏసీ రీడింగ్ హాళ్లు ఉన్నాయి. సాధారణంగా గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. అభ్యర్థులు కోరితే పనివేళలు పెంచాలని సూచించాం. అన్నిచోట్ల పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉంచాలని, శౌచాలయాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించాం. ఇప్పటికే హైదరాబాద్‌లో సెంట్రల్, రాష్ట్ర లైబ్రరీల్లో రూ.5 భోజనం అందిస్తున్నాం. పలు జిల్లాల్లోనూ అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
అవగాహన సదస్సులు పెట్టిస్తాం..
బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల సహకారంతో ఎంపిక చేసిన గ్రంథాలయాల్లో నిరుద్యోగ అభ్యర్థులకు కౌన్సెలింగ్, గైడెన్స్ ఇప్పిస్తాం. పరీక్షల విధానం, సన్నద్ధత, ఇంటర్వ్యూను ఎదుర్కోవడం తదితర అంశాలపై స్టడీ సర్కిళ్ల నిపుణులతో సదస్సులు ఏర్పాటు చేస్తాం. సేవా దృకృథంతో ఎవరైనా, ఏ సంస్థ అయినా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ముందుకొస్తే అందుకు కావాల్సిన వేదికను గ్రంథాలయాల్లో కల్పిస్తాం. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి విధివిధానాలు రూపొందిస్తాం.
ఇదీ చూడండి: Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక