ఈ నెల 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ.. ఏడు రోజులు పనిచేసిందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సభ 56:25 గంటల పాటు పని చేసిందని వివరించారు. 38 ప్రశ్నలకు మంత్రులు నేరుగా సమాధానం ఇచ్చారని.. 12 ప్రశ్నలకు జవాబులు సభ ముందు లిఖితపూర్వకంగా ఉంచారని తెలిపారు. 41 మంది సభ్యులు శాసనసభలో ప్రసంగించారని చెప్పారు. ఐదు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టి.. ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్రంపై, మోదీపై విరుచుకుపడ్డారు. మోదీకి చేతులు జోడించి కోరుతున్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండని కోరారు. కేంద్రానికి తాము సహకరిస్తామని.. తమకు కేంద్రం సహకరించాలని స్పష్టం చేశారు. మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని అన్నారు. వ్యాపార స్నేహితుల కోసం రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి విదేశీ బొగ్గు కొనిపిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సమస్యపై చర్చించి పరిష్కరించాలని కోరారు. ఎంత ఖర్చయినా సరే.. రాష్ట్రంలో ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోనీయం అని వెల్లడించారు. 16,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సమస్య లేకుండా విద్యుత్ ఇస్తామని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యాక.. ఎక్కువ జీతాలు వస్తాయని ఉద్యోగులకు చెప్పానని వివరించారు. తానే ఎక్కువ జీతాలు కలగజేస్తానని చెప్పానని.. ఆ అదృష్టం తనకే దక్కిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారికి జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఉద్యోగులు కష్టపడుతున్నారు కాబట్టి.. వారికి జీతాలు పెంచుతామని వెల్లడించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆశా వర్కర్లు, హోంగార్డులకు 30 శాతం పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: హిండెన్‌బర్గ్ నివేదికపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే: సీఎం కేసీఆర్
ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్
దేశంలో అతి పెద్ద జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభం.. అభివృద్ధికి నిదర్శనమన్న మోదీ