KTR at World Economic Forum 2023 : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇవాళ్టి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలోని ప్రభుత్వ అధికారుల బృందం ఆదివారం రోజునే దావోస్ చేరుకుంది. ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ముఖ్య సంబంధాల అధికారి అమర్‌నాథరెడ్డి, ఆటోమోటివ్, డిజిటల్ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు గోపాలకృష్ణయ్య, కొణతం దిలీప్, శక్తినాగప్పన్‌లు ఈ బృందంలో ఉన్నారు.
KTR Davos Tour : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేటీఆర్ హాజరుకావడం ఇది అయిదోసారి. గతంలో 2018, 2019, 2020, 2022 సంవత్సరాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. ఈసారి ‘భిన్న ప్రపంచంలో సహకారం’ అనే నినాదంతో సదస్సు జరుగుతోంది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పలు అవగాహన ఒప్పందాలు చేసుకునే వీలుంది.
KTR Davos Tour Update : ఈ సదస్సుకు దాదాపు 52 దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని.. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్‌కే సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, పలువురు సీఎంలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.
తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. ‘తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి’ అనేదే తమ నినాదమని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వివరించి, పెట్టుబడుల సమీకరణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఉన్న వాళ్లతో పోల్చితే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని అన్నారు.
స్విట్జర్లాండ్‌లోని ప్రవాస భారతీయులతో కేటీఆర్ సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. దావోస్ వచ్చిన ప్రతిసారి ఇక్కడి భారతీయులిచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న.. విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. విదేశాల్లో పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రవాస అభ్యర్థులందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.