ఇంటర్మీడియట్లో ఈ ఏడాది అర్ధ సంవత్సరం, ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయిచింది. డిసెంబరు 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రిఫైనల్.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్... మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దసరా, సంక్రాంతి సెలవులు కుదించిన ఇంటర్ బోర్డు... ఆన్‌లైన్ తరగతులతో కలిపి 220 పని రోజులతో విద్యాసంవత్సరాన్ని ఖరారు చేసింది.
అదే ప్లాన్...
కరోనా తీవ్రత కారణంగా ఒకవేళ వార్షిక పరీక్షలు నిర్వహించలేక పోతే.. అర్ధ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగానైనా ఉత్తీర్ణులను చేయవచ్చునని బోర్డు ఆలోచనగా తెలుస్తోంది. జూన్ 1 నుంచి జరుగుతున్న ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు.. మరో 173 రోజుల ప్రత్యక్ష తరగతులతో కలిపి.. మొత్తం 220 పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగుతాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక క్యాలెండరులో ప్రకటించింది. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
సెలవులు కుదింపు
కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది సెలవులను కుదించారు. దసరాకు ఆదివారంతో కలిపి అయిదు రోజులు, సంక్రాంతికి మూడు రోజులు సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 16 వరకు దసరా సెలవుల తర్వాత... అక్టోబరు 18న సోమవారం కాలేజీలు పునఃప్రారంభమవుతాయని బోర్డు వెల్లడించింది. సంక్రాంతికి ఆదివారంతో కలిపి జనవరి 13 నుంచి 16 వరకు నాలుగు రోజులే సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇచ్చి.. జూన్ 1న కళాశాలలు తిరిగి తెరవాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రెండో శనివారం కూడా సెలవు రద్దు చేసే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
- డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.
- ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు.
- ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్.
- మార్చి 23 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు.
- మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.
- ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
- జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం
ఇదీ చూడండి: Inter Online: ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ