పండ్ల కృత్రిమ పరిపక్వత కోసం ఇథేఫాన్ వినియోగించవచ్చా అనేది తెలపాలని ఆహార రక్షణ ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఇథేఫాన్ను వినియోగిస్తే పండులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఇథిలీన్ ఆగిపోదా!... వివరించాలని తెలిపింది. పండ్లను కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా మగ్గ పెట్టడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ 2015లో ఈనాడులో ప్రచురితమైన కథనం ఆధారంగా స్వీకరించిన పిల్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇథేఫాన్తో పరిపక్వత తెచ్చేందుకు ఆహార రక్షణ ప్రమాణాల సంస్థ అనుమతి ఉందని అమికస్ క్యూరీ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఇథేఫాన్ క్రిమిసంహారక మందుల జాబితాలో ఉన్నప్పటికీ.. నేరుగా వినియోగించకుండా ప్యాకెట్లలో పెట్టి వాడాలని ఎఫ్ఎస్ఎస్ఏ మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు.
క్రిమిసంహారక మందును పండ్ల పరిపక్వానికి వాడొచ్చా?.. అని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండ్ల వ్యాపారులు ఆహార రక్షణ ప్రమాణాల సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నారా?.. లేదా?.. తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నిబంధనలు అనుసరించకపోతే.. ప్రమాదకరమని హైకోర్టు పేర్కొంది. ఆహార రక్షణ ప్రమాణాల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: బక్రీద్ సందర్భంగా జంతు వధ జరగొద్దని హైకోర్టు ఆదేశాలు