Balkampet Yellamma Decoration With Usirikayalu : కార్తిక మాసం మొదలైదంటే చాలు గుళ్లల్లో అమ్మవార్లను ఎంత చక్కగ అలంకరిస్తారో. భక్తులూ ప్రత్యేక పూజలు చేస్తూ దైవారాధనలో మునిగిపోతారు. రోజుకో అమ్మవారిని దర్శించుకుంటుంటారు. కార్తిక మాసం మంగళవారం అయినందున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఉసిరికాయలతో అలంకరించారు. భక్తులు బోనాలతో తమ ముడుపులు చెల్లించుకున్నారు. గుడిలో వేద పండితులు అమ్మవారిని మంగళ హారతులు ఇచ్చి ధూపదీప, నైవేద్యాలతో పూజలు చేశారు. కాగా మంగళవారం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రతి మంగళవారం బల్కంపేట అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తిక మాసం కావడంతో ఇవాళ భారీ సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపారాధన చేశారు. పండితులు భక్తులకు కార్తికమాసం విశిష్టతను తెలియజేశారు. ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల కలిగే శుభాల గురించి భక్తులకు వివరించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 300 కేజీల స్వీట్స్‌తో అలంకరణ - BALKAMPET TEMPLE IN HYDERABAD
కార్తిక మాసం విశిష్టతను ఇలా వివరిస్తూ : చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయని ప్రజల నమ్మకం. ముఖ్యంగా కార్తిక మాసంలో మహిళలు, యువతులు దేవుళ్లకు దీపాలు పెడుతుంటారు. వారి మనసులో కోరిక తీరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తారు.
"మేము కార్ఖానా నుంచి వచ్చాము. నా పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి గుడికి వచ్చాను. ఈరోజు కార్తిక మాసం మంగళవారం అమ్మవారు ఉసిరికాయ అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారు చాలాబాగుంది. చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడప్పుడు గుడికి వస్తూనే ఉంటాం. అమ్మవారిని చాలా అందంగా ముస్తాబు చేస్తుంటారు. ముఖ్యంగా ఏవైనా పండుగలు వస్తుంటే ప్రత్యేకంగా అలంరిస్తారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కార్తీకమాసం వల్ల ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందరూ ఇక్కడకు వచ్చి దీపాలు పెడుతున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు." - భక్తులు