MS Dhoni Scolding Players : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని 'మిస్టర్ కూల్' అని కూడా పిలుస్తారు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా ఉంటూ, వ్యూహాలు పన్నడంలో ధోని దిట్ట. అందుకే కెప్టెన్ కూల్‌గా పాపులర్ అయ్యాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 'కెప్టెన్ కూల్' కూడా కొన్నిసార్లు కోపంతో ప్లేయర్‌లపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందా?
మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు, ప్లేయర్లు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోయినప్పుడు, అతి తెలివి ప్రదర్శించినప్పుడు ధోని కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ధోని ఆగ్రహానికి గురైన ఆటగాళ్లో ఎవరెవరు ఉన్నారంటే?
చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ అనేక సందర్భాల్లో ధోని ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ధోని, సంబంధిత ప్లేయర్‌తో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తుంటాడు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోపం ప్రదర్శించడు.
ఆటగాళ్లను తిట్టడానికి బెస్ట్ ప్లేస్ ఏది?
దీని గురించి ధోని ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ, 'ఒకరు మిస్టేక్ చేశారని చెప్పేందుకు వాళ్లని అవమానించాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తితో మీకున్న రిలేషన్‌షిప్‌పై చాలా ఆధారపడి ఉంటాయి. మీరు ఆ వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే విషయం చెప్పాలనుకుంటున్నారు' అన్నాడు.
టాయిలెట్‌లో ఆటగాళ్లను ఎందుకు తిట్టాడు?
అలానే, 'టీమ్ఇండియాలో లేదా భారతీయుడిగా నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, మీరు బోర్డు రూమ్‌లో ఎవరితోనైనా ఏదైనా చెబితే, వారు చాలా బాధపడతారు. కానీ మీరు, అతడు టాయిలెట్‌లో ఉన్నప్పుడు కాస్త కఠినంగా చెప్పినా బాధపడడు. మీరు అందరి ముందు ఏదైనా చెబితే, అతడిని తిట్టారని ఆ వ్యక్తి అనుకుంటాడు. మీరు చెప్పేది అస్సలు వినడు. అందరి ముందు తనను తిట్టినట్లు భావించి బాధపడతాడు. మీకు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తే, అతడితో ఎలా పని చేయాలి? అతడి నుంచి మంచి ఫలితాలు ఎలా పొందాలో మీకు తెలుస్తుంది.' అని తెలిపాడు.
2025 ఐపీఎల్ బరిలోకి ధోని
ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్‌ల లిస్టుని ప్రకటించాయి. అందరూ ఊహించినట్లే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. కేవలం రూ.4 కోట్లకే ధోనిని రిటైన్ చేసుకుంది. దీనివల్ల ధోని ఆదాయం భారీగా తగ్గినా, మరి కొంత కాలం అభిమానులను అలరించే అవకాశం దక్కింది.