Hotel Style Perugu Vada Recipe in Telugu : చాలా మంది మార్నింగ్ బ్రేక్‌పాస్ట్‌లో ఇష్టపడే రెసిపీలలో ఒకటి దహీ వడ. అయితే, వీటిని హోటల్లో టేస్ట్ చేసినప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. కానీ, ఇంట్లో చేసుకుంటే అలా రావట్లేదని ఫీల్ అవుతుంటారు కొందరు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అవుతూ పెరుగు వడలను ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ హోటల్ స్టైల్‌కి ఏమాత్రం తీసిపోదు! మరి, ఇంకెందుకు ఆలస్యం నోరూరించే కమ్మని దహీ వడను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మినప పప్పు - 1 కప్పు
- వంటసోడా - చిటికెడు
- నూనె - వేయించడానికి తగినంత
పెరుగు తయారీ కోసం :
- పెరుగు - 4 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్
- తాలింపు గింజలు - 2 టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - కొద్దిగా
- అల్లం తురుము - 1 టీస్పూన్
- సన్నని పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- క్యారెట్ తురుము - 2 టేబుల్‌స్పూన్లు
- టమాటా ముక్కలు - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మినపపప్పును శుభ్రంగా కడిగి కనీసం 2 నుంచి 3 గంటలపాటు నానబెట్టుకోవాలి. అనంతరం నానబెట్టుకున్న పప్పును మరోసారి శుభ్రంగా కడిగి వాటర్‌ను వడకట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వడకట్టుకున్న మినపపప్పు, కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యూజ్ చేయవద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వంటసోడా వేసుకొని గరిటె లేదా విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి.
- కనీసం ఐదు నిమిషాలైనా పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనం తయారు చేసుకున్న పిండి అనేది బాగా ఫ్లఫ్పీగా తయారవ్వడమే కాకుండా వడలు బాగా పొంగి గుల్లగా వస్తాయి.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. గిన్నెపై మూతపెట్టేసి ఒక గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. లేదంటే మీరు ముందు రోజే పిండిని గ్రైండ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచి నెక్ట్ డే వాడుకోవచ్చు.
- ఆలోపు మీరు రెసిపీలోకి కావాల్సిన పెరుగును ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో తాజా పెరుగు వేసుకోవాలి.
- ఆపై మీరు పెరుగు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకొని విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ పెరుగుకి తాలింపు పెట్టుకోవాలి.
- ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక దింపేముందు ఇంగువ వేసి కలుపుకోవాలి.
- అనంతరం ఈ తాలింపుని ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్న పెరుగులో వేసి కలుపుకోవాలి. ఆపై అందులో సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర తరుగు, సన్నని టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. రెసిపీలోకి కావాల్సిన పెరుగు రెడీ!
- ఇక ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి.
- నూనె వేడయ్యాక స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చేతిని వాటర్‌లో డిప్ చేసి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ వడల మాదిరిగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. తర్వాత వాటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- వడలు క్రిస్పీగా వేగాక వాటిని గరిటెతో తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో పల్చగా చేసుకున్న మజ్జిగలో వేసుకొని అరనిమిషం పాటు ఉంచాలి.
- ఆ తర్వాత మజ్జిగ పీల్చుకున్న ఆ వడలను తీసుకొని చేతితో కొంచం ప్రెస్ చేసుకొని ముందుగా తాలింపు వేసి రెడీ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ పిండి మొత్తం అయ్యే వరకు కంటిన్యూ చేయాలి.
- ఇలా అన్నీ వడలనూ పెరుగులో వేసుకున్నాక మూతపెట్టి కనీసం 2 గంటలపాట కదపకుండా నానబెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ "దహీ వడ" రెడీ!
ఇవీ చదవండి :
వడలు చేయాలంటే పిండే రుబ్బాలా ఏంటి? - ఈ పదార్థాలతో నిమిషాల్లో రెడీ! ఇక టేస్ట్ సూపర్!