Jharkhand INDIA Bloc Manifesto : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా బ్లాక్ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే యువతకు 10 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
రిజర్వేషన్లు పెంచుతాం!
ఇండియా బ్లాక్ '7 గ్యారెంటీస్' పేరుతో ఝార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకుగాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొంది. ప్రధానంగా ఎస్టీలకు 28 శాతం, ఎస్సీలకు 12 శాతం, ఓబీసీలకు 27 శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొంది. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఎస్టీలకు 26 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఓబీసీలకు 14 శాతం వరకు రిజర్వేషన్లు ఉన్నాయి.
రేషన్ పెంపు
ఇండియా బ్లాక్ కనుక అధికారంలోకి వస్తే, పేదలకు ఇస్తున్న రేషన్‌ను 5కేజీల నుంచి 7 కేజీలకు పెంచుతామని ఇండియా బ్లాక్ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే కేవలం రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ పార్టీ నేత జేపీ యాదవ్ ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఎప్పటికీ నెరవేరవని మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.
బీజేపీ మేనిఫెస్టో
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇది వరకే బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'గోగో దీదీ పథకం' కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక భరోసా ఇస్తామని తెలిపింది. దీపావళి, రక్షాబంధన్ కానుకగా ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఝార్ఖండ్ యువతకు 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో సహా 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రాంచీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సంకల్ప్ పత్ర పేరిట పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఓట్స్ కౌంటింగ్ జరగనుంది.