Telangana HC on Medical Science Council : రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో ఎన్నికయ్యే(ఎలెక్టెడ్) సభ్యుల సంఖ్య తగ్గించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక మండలి ఏర్పాటు సైతం చట్టవిరుద్ధమని పేర్కొంది. కౌన్సిల్‌లో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గిస్తూ 2015 ఆగస్టు 3న ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.68ను, తాత్కాలిక కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ 2016 జనవరి 6న జారీ చేసిన జీఓ నం.15ను సవాలు చేస్తూ హెల్త్‌కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తదితరులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
చట్టంలో సవరణలు శాసనసభ ద్వారానే చేయాలి: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద పాత చట్టాల అన్వయం పేరుతో ప్రభుత్వం సవరణలు తీసుకురావడం సరికాదని పేర్కొంది. చట్టంలో సవరణలను శాసనసభ ద్వారానే చేయాలని, జీఓ ద్వారా కాదని స్పష్టం చేసింది. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం కింద ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్‌లో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గించిన ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుల సంఖ్యను యథాతథం(6)గా ఉంచిందని.. దీనివల్ల ఎన్నికైన సభ్యులు మైనారిటీకి చేరుకున్నారంది. అందువల్ల అన్వయం పేరుతో చట్ట సవరణకు తీసుకువచ్చిన జీఓ నం.68 చెల్లుబాటు కాదని పేర్కొంది.
జీఓ నం.15 లో ఏముంది: 2007 నుంచి మెడికల్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించలేదని.. రాష్ట్ర విభజన అనంతరం నలుగురితో తాత్కాలికంగా పాలకమండలి ఏర్పాటు చేసిందని, ఇలా చేయడానికి చట్టంలో నిబంధనలు లేవని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక మండలిని ఏర్పాటు చేసినా ఆరేళ్లపాటు కొనసాగించకూడదంది. అందువల్ల తాత్కాలిక మండలిని ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీఓ నం.15 చట్టవిరుద్ధమని పేర్కొంది. తాత్కాలిక మండలిని తక్షణం రద్దు చేసిన పక్షంలో కౌన్సిల్ కార్యకలాపాలైన వైద్యుల నమోదు, క్రమశిక్షణ చర్యలు వంటివి చేపట్టడానికి ఎవరూ ఉండరని, అందువల్ల లలిత్ మోదీ వర్సెస్ బీసీసీఐ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ఆవశ్యకత సిద్ధాంతాన్ని ఇక్కడా అన్వయించవచ్చని అభిప్రాయపడింది.
దీని ప్రకారం కొత్త కౌన్సిల్ ఏర్పాటయ్యేదాకా జీఓ నం. 15 కింద ఏర్పాటైన తాత్కాలిక కౌన్సిల్‌ను కొనసాగించడానికి అనుమతిస్తున్నామని తెలిపింది. తీర్పు ప్రతి అందిన మూడు నెలల్లోపు కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలని, కొత్త కౌన్సిల్ ఏర్పాటైన వెంటనే జీఓ నం.15 రద్దయిపోతుందని వివరించింది. నామినేటెడ్ సభ్యుల నియామకంతో కౌన్సిల్‌పై ఆధిపత్యానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ 41 పేజీల తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి: