సచివాలయం కూల్చివేతపై దాపరికం ఎందుకని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతలపై ప్రజలను చీకట్లో ఉంచుతున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతలపై మీడియా కవరేజీకి అనుమతివ్వాలని వీఐఎల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే 90 శాతం కూల్చివేతలు పూర్తయ్యాయని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు.
బ్యారికేడ్లు ఏర్పాటుచేసి ఎవరినీ అనుమతించవద్దని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంతో సంప్రదించి పూర్తి వివరాలు సమర్పించేందుకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. వాయిదాలు కోరడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్‌పై రోజూ బులెటిన్ ఇస్తున్నట్లుగానే కూల్చివేతలపై వివరాలు సమర్పించడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. రేపట్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం