‘కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లయితేనే కంటెయిన్‌మెంట్ జోన్ ఉంటుంది. కొవిడ్ వ్యాప్తి ఎక్కడ ఉందో చెప్పండి. కంటెయిన్‌మెంట్ జోన్లను ప్రకటించాలంటూ కోర్టు ఆదేశించజాలదు’
‘బార్లను, రెస్టారెంట్లను మూసివేయాలని కేంద్రం ఎక్కడ చెప్పింది? వేటి ఆధారంగా మేం ఆదేశాలివ్వాలి?’
High Court on New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో జోక్యం చేసుకోవాలని, బార్లు, పబ్బుల్లో మద్యం అమ్మకాల సమయాలను తగ్గించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నూతన సంవత్సర వేడుకల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. బార్లు, పబ్బుల్లో మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులనైనా సవరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. క్లబ్బులు, బార్లు, హోటళ్లలోకి వ్యాక్సిన్ వేయించుకున్నవారినే అనుమతించాలని, హోటళ్లు, బార్ల సిబ్బందికి 48 గంటల ముందు కొవిడ్ పరీక్షలు నిర్వహించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. అంతేగాకుండా కేంద్రం సమయానుకూలంగా జారీ చేస్తున్న మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
‘హోటళ్లు...రెస్టారెంట్లకు ఎక్కడికి వెళ్లినా ఇక్కడ కోర్టులో ఉన్నట్లు భుజం భుజం రాసుకుంటూ జనం కనిపించడం లేదు. రెస్టారెంట్లను మూసివేయాలంటే ముందుగా కోర్టులను మూసివేయాల్సి ఉంటుంది. కోర్టు బయట నిలబడి వ్యాక్సిన్ వేసుకోని వారిని నలుగురిని తీసుకురండి చూద్దాం.
High Court on New Year Celebrations 2022: కొవిడ్ నియంత్రణకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీహెచ్.ప్రభాకర్, కె.పవన్‌కుమార్‌లు వాదనలు వినిపించారు. వాటిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మొదటి డోసు వ్యాక్సిన్ వేయడం పూర్తి చేసిందని, రెండో డోసు కూడా 66 శాతం మందికి వేసిందన్నారు. గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు కాలేదన్న న్యాయవాదుల వాదనను తోసిపుచ్చుతూ అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. మరీ నియంత్రణ తప్పనిసరంటే కోర్టులోకి కూడా నలుగురినే అనుమతించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకల్లో జోక్యం చేసుకోలేమని, కొవిడ్‌పై కేంద్ర మార్గదర్శకాల అమలుపై నివేదిక సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చూడండి: new year wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు