Telangana High Court Judgement on Shamshabad Lands : తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సదరు భూములు హెచ్‌ఎండీఏ(HMDA)కే చెందుతాయని హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు 181 ఎకరాల భూమి ఉంది. ఇందులో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ మేరకు సంబంధం లేని సర్వే నెంబర్లను చూపించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ భూమి విలువ సుమారు రూ.1000 కోట్లకు మార్కెట్ విలువ ఉంటుందని అంచనా.
భూ కబ్జాదారులు చేసిన కుట్రను హెచ్ఎండీఏ కమిషనర్, న్యాయ విభాగం అధికారులతో భూ రికార్డులను క్షుణ్నంగా పరిశీలించి హైకోర్టు(Telangana High Court)లో ఆధారాలు సమర్పించారు. ఏడాది పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ధర్మాసనం గత నెల 18న తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు హెచ్‌ఎండీఏకు అనుకూలంగా ఇచ్చింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండీఏ 1990 సంవత్సరంలో ట్రక్ టెర్మినల్ పార్క్(Truck Terminal Park) ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ కింద తీసుకుంది.
High Court Decided 181 Acres in Shamshabad is HMDA : అప్పటి నుంచి ఈ భూములపై హెచ్ఎండీఏకు సర్వ హక్కులు ఉన్నాయి. ఈ భూముల్లో దాదాపు 20 ఎకరాల్లో నర్సరీ ఉంది. మరో రెండు ఎకరాల భూమిని ప్రజల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్‌కు కేటాయించారు. శంషాబాద్ పురపాలక కార్యాలయం నిర్మాణం కోసం 30 గుంటల భూమిని కేటాయించారు. మిగతా భూమి అంతా హెచ్‌ఎండీఏ అధీనంలో ఉంటుంది. ఇలాగే రాష్ట్రంలోని చాలా భూములు భూకబ్జాదారులు అక్రమంగా రికార్డులు సృష్టించి, వేల ఎకరాల భూములను అక్రమ మార్గంలో దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్, శివారు ప్రాంతాల్లో భూ బకాసురులు అక్రమాలకు పంజా విసురుతున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో కోర్టుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ హెచ్ఎండీఏ కేసుతో ఇలాంటి కేసులు ఎన్ని బయటపడతాయో చూడాలి మరి.
అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం - సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు