మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు పూర్తైందని.. కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు నివేదించింది. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన డ్రగ్స్ కేసులను.. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిపింది.
ఈ వాజ్యంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు దాఖలు చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద.. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు.... రాష్ట్ర ఎక్సైజ్, పోలీసు శాఖలకూ ఉందన్నారు. 2017లో నమోదైన 12 కేసుల్లో 11 చార్జిషీట్లు దాఖలు చేశామన్నారు. మరో కేసులోనూ దర్యాప్తు పూర్తైందని త్వరలో అభియోగపత్రం వేస్తామని వివరించారు. రేవంత్ రెడ్డి వేసిన పిల్‌ను కొట్టి వేయాలని కోరారు.
వివరాలు ఇవ్వలేదు..
డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణంపై విచారణకు సిద్ధమన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... ఎక్సైజ్ శాఖ ఎఫ్ఐఆర్‌లు మినహా వివరాలు ఇవ్వడం లేదని ధర్మాసనానికి తెలిపింది. సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జిషీట్లు, ఇతర దస్త్రాలను ఇచ్చేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని ఈడీ కోరింది. మరోవైపు.. ఎక్సైజ్ శాఖ నివేదిక మొక్కుబడిగా ఉందని... రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఎక్సైజ్ శాఖ కౌంటరుపై అభ్యంతరాలను రెండు వారాల్లో సమర్పించాలని రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది
ఇదీ చూడండి : స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దు: హైకోర్టు