HighCourt on Podu Lands: పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనల మేరకే పోడు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ జరపాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది వాదించారు. నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె.శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
ఆదివాసీల అటవీ హక్కుల చట్టం ఉద్దేశం అడవులపై ఆధారపడిన గిరిజనులకు ప్రయోజనాలు కల్పించడమేనని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ జూన్ 22కి వాయిదా వేసింది. అయితే పోడు భూముల క్రమబద్దీకరణను చట్టప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఇటీవల పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయన్న కేసీఆర్... అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయన్నారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటేనే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారన్న కేసీఆర్... అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదన్నారు. పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇకనుంచి పోడు భూములు రక్షిస్తామని హామీ ఇవ్వాలని కోరారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోమని హెచ్చరించిన కేసీఆర్... అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమని అన్నారు.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా అన్ని పార్టీల నేతలు మండి పడుతున్నారు. కొత్త నాటకానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపించారు. అటు బీజేపీ నేతలు... మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కేసీఆర్ తీరును తప్పుపడుతున్నారు.
ఇవీ చదవండి: