Highcourt Permission for BJP Mahadharna : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరుద్యోగ మార్చ్ పేరుతో నిరసనలకు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నాయకులను పోలీసులు నిర్బంధించారు. మరోవైపు బీజేపీ శనివారం పేపర్ లీకేజీ వ్యవహారంపై మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఇందిరాపార్కు వద్ద బీజేపీ శనివారం చేపట్టనున్న మహాధర్నాకు అనుమతి కోసం బీజేపీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించరాదని బీజేపీకి హైకోర్టు షరతు విధించింది. అదే విధంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ధర్నాకు హాజరయ్యే నేతల వివరాలు రాత్రి 9 గంటల వరకు పోలీసులకు ఇవ్వాలని సూచించింది.
జనం ధర్నాలు ఎక్కడ చేయాలి : అలాగే ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ సహేతుకంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మహాధర్నాకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు పంపింది. ధర్నాచౌక్ వద్ద అనుమతివ్వకపోతే జనం ధర్నాలు ఎక్కడ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిరసన తెలపడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. పొరపాట్లు జరిగినప్పుడు ప్రభుత్వం నిరసనను ఎదుర్కోవాలని ధర్మాసనం సూచించింది. ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.
సిట్ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదు : మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఏర్పాటు చేసిన సిట్ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈ మేరకు సిట్‌కు లేఖ రాశారు. నోటీసులోని విషయాలు తాను చూడలేదనే అంశాన్ని నిస్సందేహంగా తెలియజేస్తున్నాని బండి పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున... హాజరవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నేడు తాను సిట్ ఎదుట హాజరుకావాల్సింది ఉందని వార్తా కథనాల ద్వారా అర్థమైందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల కారణంగా తాను ఇవాళ రాలేనని బండి.. హాజరుకు మరో తేదీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: