తెలంగాణలో జలాశయాల పరిరక్షణ పట్ల జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కూకట్‌పల్లిలో బతుకమ్మ, వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన కొలను చెత్తకుండీగా మారి కాలుష్యం వెదజల్లుతోందని పేర్కొంటూ 'ఈనాడు'లో ప్రచురితమైన ఫొటో ఆధారంగా స్వీకరించిన సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ లక్ష్మణ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
మరో జైసల్మేర్
జీహెచ్ఎంసీ కమిషనర్ దాఖలు చేసిన కౌంటరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెరువు కాలుష్య మైనట్లు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ నిరాధారమైన నివేదిక సమర్పించారని పేర్కొంది. రాష్ట్రంలో చెరువులు, కొలనులు కబ్జాలు, కాలుష్యంతో నిండిపోతుంటే.. జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులు నిద్రపోతున్నారా.. అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. జలాశయాలను కాపాడుకోకపోతే మరో ఇరవై ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం.. రాజస్థాన్‌లోని జై సల్మీర్ పట్టణంలా తయారవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారులు పత్రికలు చదవడం లేదా..
బెంగళూరులో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారని న్యాయస్థానం గుర్తుచేసింది. అధికారులు కనీసం పత్రికలు కూడా చదవడం లేదని.. హైదరాబాద్‌లోని రెండు చెరువులు కబ్జాకు గురైనట్లు రెండు రోజుల క్రితం పత్రికల్లో కథనాలు వచ్చాయని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ రాజీనామా చేసి..
కూకట్పల్లి కొలనులో స్థానికులు వ్యర్థాలు వేయకుండా ఉండేందుకు అక్కడ ఓ సెక్యూరిటీ గార్డును నియమించడానికి అడ్డేమిటని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సెక్యూరిటీ గార్డును నియమించి ఓ మొబైల్ ఇస్తే ఎవరూ చెత్త వేయకుండా అడ్డుకోవడం, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇస్తారు కదా అని పేర్కొంది. కొలను వద్ద సెక్యూరిటీ గార్డును నియమించే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేదని న్యాయవాది పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ నుంచి ఇలాంటి సమాధానం ఊహించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది.
సెక్యూరిటీ గార్డును నియమించలేకపోతే జీహెచ్ఎంసీ కమిషనర్ రాజీనామా చేసి.. తాను సరిగా విధులు నిర్వహించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పడం మంచిదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జలాశయాల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
ఇవీచూడండి: దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం