దేవుడయినా, దేవాలయమైనా రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు పేర్కొంది. పార్కు స్థలంలో అక్రమంగా ఆలయం నిర్మిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు ధర్మాసనం ఆదేశించింది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని మాధవీపురి హిల్స్‌లో రాక్‌గార్డెన్ పార్కు స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మిస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. అమీన్పూర్ పంచాయతీ ఈవో హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
మీరే కుమ్మక్కయ్యారు..
అనుమతుల్లేకుండా ఆలయం నిర్మిస్తున్నారని పిటిషనర్ ఫిర్యాదు చేస్తే ఎందుకు స్వీకరించలేదని ఈవోను ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంది. మాధవీపురి హిల్స్ రెసిడెంట్స్ సంక్షేమ సంఘానికి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేసినా.. నిర్మాణాలు ఆపలేదని ఈవో వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఊరుకున్నామని ఈవో వివరణ ఇచ్చారు. పోలీసులకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. ఈవో సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. సొసైటీ, ఆలయ కమిటీ కుమ్మక్కవడమే అసలు కారణమని.. అందులో భాగస్వామ్యమయ్యారని ఈవోపై మండిపడింది.
ఎస్ఐ పట్టించుకోపోతే.. డీజీపీకి చెప్పండి
శాంతిభద్రతల సమస్యను బూచిగా చూపి అక్రమ నిర్మాణాలను అడ్డుకోరా అని హైకోర్టు నిలదీసింది. ఎస్ఐ స్పందించక పోతే.. ఎస్పీకి లేదా డీజీపీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడానికి పంచాయతీకి... చట్టం స్పష్టమైన అధికారాలు ఇచ్చిందని.. కావల్సింది సంకల్ప బలమేనని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ.. నగరాలు, పట్టణాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆలయ నిర్మాణానికి అనుమతులేవి..
ఆలయ నిర్మాణానికి అనుమతులు చూపాలని ఆలయ కమిటీని హైకోర్టు ఆదేశించింది. తాము చేస్తున్నది మంచి పనేనని ఆలయ కమిటీ తరఫు న్యాయవాది సమాధానమివ్వగా.. ధార్మిక, దాతృత్వ కార్యక్రమాల పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. దేవుడు ఈ కేసులో ప్రతివాదిగా లేరని.. చట్టం ప్రకారం దేవుడి విగ్రహం, దేవాలయం మైనర్లని.. ఆలయ కమిటీ న్యాయవాది వాదించారు. అయితే దేవుడిని కూడా ప్రతివాదిగా చేర్చి రికార్డుల్లోకి తీసుకురావాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
ఇవీచూడండి: దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం