Telangana Govt Lands: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై భాజపా నేత విజయశాంతి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే... భూముల విక్రయంలో టెండర్లు, ఈవేలం వంటి వాటిల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని సూచించింది.
విజయశాంతి పిల్..
Vijayashanthi Pil: భావితరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని భాజపా నాయకురాలు విజయశాంతి గతంలో విమర్శించారు. భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని భూముల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆమె కోరారు. నిధుల సమీకరణ కోసం విలువైన ప్రభుత్వ భూములు అమ్మడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన ఉత్తర్వులకు తానే విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్లో విజయశాంతి ఆరోపించారు. ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ప్రతివాదులుగా పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. అయితే తాజాగా సర్కారు భూములను విక్రయించడం తప్పుబట్టలేమని హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: VIJAYASANTHI: ప్రభుత్వ భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ విజయశాంతి పిల్