Telangana Gurukulam Exam 2023 : గురుకుల నియామక పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. ఒక్కో పేపర్‌కు ఒక్కో జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో టీజీటీ, పీజీటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, జేఎల్, డీఎల్ తదితర బోధన సిబ్బంది నియామకాలకు ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్ పరీక్షలు ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో 9 వేల 210 ఉద్యోగాల కోసం సుమారు 2 లక్షల 66 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. టీజీటీ పరీక్ష దాదాపు లక్ష మంది రాయనున్నారు. అభ్యర్థులు మూడు దఫాలుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించేలా గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా నియామక, ప్రవేశ పరీక్షల్లో ఒకటి మించి పేపర్లు ఉన్నట్లయితే ఒక అభ్యర్థి ఒక కేంద్రంలోనే అన్నీ రాసేలా ఏర్పాట్లు ఉంటాయి. కానీ గురుకుల నియామక బోర్డు మాత్రం.. పలువురు అభ్యర్థులకు మూడు పేపర్లకు వేర్వేరు కేంద్రాలను కేటాయించింది. కొందరికి ఒకే నగరం, పట్టణంలో మరో కేంద్రం కేటాయించగా.. మరికొందరికి వందల కిలోమీటర్ల దూరంలో కేటాయించారు. కొందరికైతే ఒక్కో పేపర్‌కు ఒక్కో జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని సూచించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
"మా స్నేహితులకు ఒకరోజు హైదరాబాద్, మరోరోజు కరీంనగర్, ఇంకోరోజు వరంగల్‌లో సెంటర్ పడింది. ఇలాంటప్పుడు మాకు సెంటర్ల ఆప్షన్స్ ఎందుకు ఇవ్వాలి. లోకల్ సెంటర్ కాకుండా కేవలం హైదరాబాద్‌లోనే రాయాలి అంటే అసలు పరీక్ష రాయకపోతుండే." - అభ్యర్థి
ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెబుతూ నిరుద్యోగులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెడుతోందని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్ పరీక్షలకు ఒకే కేంద్రం కాకుండా.. వేర్వేరు ఇవ్వడమే నిదర్శనమంటూ మండిపడ్డారు. ఒకే కేంద్రంలో మూడు పరీక్షలు ఉండేట్లు చూడాలని లేదంటే.. రోజు విడిచి రోజు పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2 లక్షల 60 వేల మంది పరీక్షలు.. రాయడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
"అసలే వర్షాకాలం.. ఒకవైపు రవాణా వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఒకచోటు నుంచి మరో చోటుకి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కో పేపర్ ఒక్కో చోట పెడితే అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడతారు. ఓవైపు ఖాళీలు భర్తీ చేస్తున్నాం అంటూనే మరోవైపు అభ్యర్థులను నానా తిప్పలు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం." - బల్మూరి వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఆన్‌లైన్ పరీక్షకు అందుబాటులో ఉన్న స్లాట్లకు అనుగుణంగా కేంద్రాలు కేటాయించినట్లు గురుకుల నియామక బోర్డు అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటం.. స్లాట్లు తక్కువగా ఉన్నందున కొందరికి ఇలా కేటాయించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని.. ఎలాంటి మార్పులు లేవని గురుకుల నియామక బోర్డు స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి: