Telangana GSDP: తెలంగాణ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొట్టమొదటిసారిగా జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో భారీగా వృద్ధిరేటు నమోదు కావడం గమనార్హం. జీఎస్‌డీపీలో 19.46 శాతం నమోదు చేయగా తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీని ప్రస్తుత ధరల్లో రూ. 1,154,860 కోట్లుగా, తలసరి ఆదాయాన్ని రూ. 2,78,833గా కేంద్రం ధ్రువీకరించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) సోమవారం ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2.25 శాతం మాత్రమే కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. జీఎస్‌డీపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 16.85 శాతం అధిక వృద్ధిరేటును సాధించింది. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు గత ఏడాది కంటే 17.14 శాతం ఎక్కువ సాధించింది.
జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తెలిపారు. రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూ సీఎం కేసీఆర్ ఆదర్శ పాలనలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందన్న హరీశ్ రావు.. దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందనడానికి కేంద్ర తాజా గణాంకాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. జీఎస్డీపీలోనూ గణనీయమైన వృద్ధిరేటు సాధించిందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా విభజన సమస్యలను అధిగమించి రాష్ట్రం మందుకు సాగుతుందనడానికే కేంద్ర గణాంకలే నిదర్శనమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2021 వరకు తెలంగాణ తలసరి ఆదాయం 125 శాతం, జీఎస్డీపీ 130 శాతం పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యంత తక్కువ వయస్సు కలిగిన రాష్ట్రం అభివృద్ధి ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: