JPS Regularization in Telangana 2023 : జిల్లాల వారీగా సంఖ్య నిర్ధారణతో పాటు మరికొన్ని అనుబంధ ఉత్తర్వులొస్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ జరుగుతుంది. 2019 ఏప్రిల్ 11న రాష్ట్రవ్యాప్తంగా 9 వేల 350 జేపీఎస్‌ల నియామకం జరిగింది. మొదట్లో రెండేళ్ల శిక్షణ కాలాన్ని విధించిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని మరో రెండేళ్లు పొడిగించి ఉత్తర్వులు జారీ చేసింది.
నాలుగేళ్లయినా తమను క్రమబద్ధీకరించలేదని జేపీఎస్‌లు ఏప్రిల్ నెలాఖరున సమ్మె చేశారు. అనంతరం వారి క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చిన ప్రభుత్వం పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు జిల్లాస్థాయి మదింపు కమిటీలను నియమించింది. ఆయా కమిటీలు జిల్లాల వారీగా జేపీఎస్‌ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, మార్కులను కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబార్డినేట్ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వారికి ఆశాజనకంగా మారింది.
Telangana Govt to Regularize JPSs : రాష్ట్రంలోని 12 వేల770 గ్రామాలను నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తే జేపీఎస్‌ల నియామకానికి వీలు కలుగుతుంది. పంచాయతీ కార్యదర్శుల కేటగిరీలో జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్‌ను ఖరారు చేయాలి. దానికి అనుగుణంగా కొత్తగా క్రమబద్ధీకరించే వారి నియామకాలకు అవకాశం ఉండనుంది. ఫీడర్ కేటగిరీలో పదోన్నతులకు అవకాశం కల్పిస్తే జేపీఎస్‌లు వాటిని పొందే వీలుంటుంది. వీటన్నింటి కోసం సబార్డినేట్ సర్వీసు నిబంధనల సవరణలు జరిగి, ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఓవైపు జిల్లాస్థాయి మదింపు జరుగుతుండగానే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో... కమిటీలతో సంబంధం లేకుండా క్రమబద్ధీకరణ జరుగుతుందని జేపీఎస్‌లు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులపై తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఉత్తర్వులను వెంటనే జారీ చేసి, క్రమబద్ధీకరణ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Junior Panchayat Secretaries Regularization in Telangana 2023 : ప్రస్తుతమున్న జేపీఎస్‌లను ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికనే నియమించింది. వారిని ప్రభుత్వ సర్వీసులో చేర్చలేదు. రెండేళ్ల శిక్షణ కాలం పూర్తయ్యాక అది జరగాల్సి ఉండగా... ప్రభుత్వం కారణంగా జాప్యమైంది. తమను ప్రభుత్వ సర్వీసులో చేర్చాలని జేపీఎస్‌లు రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. తాజా ఉత్తర్వులతో వారిని కూడా ఫీడర్ కేటగిరీ కింద ప్రభుత్వ సర్వీసులోకి చేర్చేందుకు అవకాశం వచ్చంది. సర్వీసు నిబంధనల మేరకు గ్రేడ్-1, 2, 3, 4 అనే నాలుగు కేటగిరీలు ఉండగా జేపీఎస్‌లను నాలుగో గ్రేడ్‌లో చేర్చారు. ఈ గ్రేడ్‌కు డిగ్రీ అర్హతగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసే వారంతా డిగ్రీ ఉత్తీర్ణులే అయినందున వారి క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: