దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం
సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 3 వేల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీల్లో బీఈడీ అర్హత ఉన్నవారు సీనియారిటీ ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులవుతారు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల్లో 70 శాతాన్ని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నింపుతారు.
పదోన్నతులు లభిస్తే భాషా పండితులు పోటీపడవచ్చు
స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు 5 వేల వరకు ఉండొచ్చని అంచనా. టీఆర్‌టీ-2017లో 1,941 స్కూల్ అసిస్టెంట్ల నియామకానికి పరీక్ష నిర్వహించారు. 2016 నాటి ఖాళీల ఆధారంగా చేసినందున డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి మరో 500-1000 వరకు స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు ఉండొచ్చు. పదోన్నతులు లభిస్తే కొందరు భాషా పండితులు పోటీపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొత్త జిల్లాల ప్రకారం పదోన్నతులు
హైకోర్టు ఆదేశాలు ఉన్నందున కొత్త జిల్లాల ప్రకారం పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. ఒక్కో జిల్లా రెండు నుంచి నాలుగు జిల్లాలుగా విభజన అయింది. పాత జిల్లా నుంచి కొన్ని మండలాలు మరో పాత జిల్లా పరిధిలోకి కూడా వెళ్లాయి. గతంలో ఉమ్మడి జిల్లా కావడంతో ఒకచోట పుట్టిన వారు అదే జిల్లా పరిధిలో, ఇతర జిల్లాల్లో విద్యనభ్యసించారు. ఎవరు.. ఏ జిల్లాకు చెందిన వారన్నది మొదట నిర్ణయించాలి.
మార్గదర్శకాల తయారీకి అధికారుల కసరత్తు
గతంలో 31 జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటైనందున 33 జిల్లాలుగా గుర్తిస్తూ రాష్ట్రపతి నుంచి సవరణ ఉత్తర్వులు జారీ కావాలి. అది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే దస్త్రాన్ని పంపింది. ఆమోదం పొందేలోపు ఉపాధ్యాయులను ఏ జిల్లా వారో తేల్చేందుకు మార్గదర్శకాల తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ