తెలంగాణలో ఆగమ సలహా బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2021 సంవత్సరానికి అర్చకుల ఎంపిక పరీక్షలు నిర్వహించేందుకు బోర్డును ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పది మంది సభ్యులతో ఆగమ సలహా బోర్డు ఏర్పాటైంది. పంచరాత్రానికి సంబంధించి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం స్థానాచార్యులు స్థలసాయిని పండితులుగా నియమించింది. స్మార్థ ఆగమానికి సంబంధించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విశ్రాంత స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య పండితులుగా వ్యవహరించనున్నారు. వైఖానశ ఆగమానికి జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు పవన్ కుమార్ ఆచార్య నియమితులయ్యారు. శైవ ఆగమానికి సంబంధించి రంగంపేట శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయం అర్చకులు నీలకంఠం, గ్రామదేవత ఆగమానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయం వేదపండితులు రామకృష్ణను ప్రభుత్వం నియమించింది.
సంస్కృతానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ రామాచారి ఉంటారు. వీరశైవానికి సంబంధించి మీర్ పేటకు చెందిన వీరశైవ పండితులు మహంతయ్యను నియమించింది. తంత్రసారం ఆగమానికి కాచిగూడ ఉత్తరాది మఠానికి చెందిన జోషి రామకంఠాచార్య, చాత్తాద శ్రీవైష్ణవానికి సంబంధించి కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయం విశ్రాంత స్థానాచార్యులు మారుతి నియమితులయ్యారు. జ్యోతిష్యానికి సంబంధించి జీయర్ స్వామి ఆస్థాన సిద్ధాంతి కృష్ణమాచార్యులును నియమించారు. అటు దేవాలయాలకు సంబంధించిన సర్వశ్రేయోనిధి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో దేవాదాయ శాఖ అధికారులు, వివిధ ఆలయాల ఈఓలు, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల కాలానికి ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఆలయఆకృతి మార్పులకు తితిదే ఆగమ సలహా మండలి అంగీకారం