ఇంటర్ పరీక్షల విషయమై చర్చించేందుకు గురువారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఇంటర్‌బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి ప్రారంభం కావాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 9.50 లక్షలమంది ఉన్నారు. ప్రతిరోజూ 4.75 లక్షలమంది వరకు పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం కళాశాలలను మూసేసినందున విద్యార్థులు ఇళ్ల వద్దే ఉంటున్నారు. పరీక్షలంటే మళ్లీ వారంతా పట్టణాలు, నగరాల్లోని కళాశాలలకు రావాలి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఎక్కువమంది ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని హాస్టళ్లలో ఉండి పరీక్షలకు హాజరవుతారు. అంటే కళాశాలలను, హాస్టళ్లను తెరవాల్సి ఉంటుంది.
పరీక్షలు ప్రారంభానికి కనీసం వారం ముందే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. పరీక్షల కోసం విద్యార్థులు రెండు వారాలపాటు హాస్టళ్లలో ఉండాలి. ఆ సమయంలో ఎవరైనా కరోనా బారిన పడితే కళాశాలలను మూసివేయాల్సి వస్తుంది. మరోవైపు మే నెలలో కరోనా కేసులు తగ్గే సూచనలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
వాయిదాకే ఎక్కువ అవకాశాలు?
సీబీఎస్‌ఈనే వాయిదా వేసినందున ఎన్‌ఐటీ, ఐఐటీల ప్రవేశాలకు సమస్య అవుతుందన్నది లేదు. ప్రవేశ పరీక్షలంటే ఒకరోజు రాసి ఇళ్లకు వెళ్లిపోతారు. ఇంటర్ పరీక్షలు అందుకు భిన్నం. ఒకరోజు ప్రథమ ఇంటర్, మరోరోజు ద్వితీయ ఇంటర్ పరీక్ష.. అలా రెండు వారాలపాటు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనూ వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రథమ ఇంటర్‌లో అందర్నీ పాస్ చేయడంపై ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. గురువారం జరిగే సమావేశంలో కొంతవరకు స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత తీసుకోవచ్చని తెలుస్తోంది. ‘సాధారణంగా ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు చివరి నెల మొత్తం చదువుతారు. మిగిలిన సమయాన్ని జేఈఈ, నీట్ కోసం కేటాయిస్తారు. ప్రభుత్వం తేల్చిచెబితే విద్యార్థులు దేనికి సమయం కేటాయించాలో నిర్ణయించుకుంటారు’ అని ఇంటర్ విద్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అన్నారు.
టెన్త్‌లో అందరూ పాసా?
పదో తరగతి పరీక్షల నిర్వహణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం కొన్నాళ్లుగా యోచిస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితులను చూస్తుంటే పరీక్షలను నిర్వహించే అవకాశం కనిపించడంలేదు. పరీక్షలు రద్దు చేస్తే టెన్త్ విద్యార్థులను పాస్ చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయని విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది మాదిరిగా అంతర్గత పరీక్షలు (ఫార్మేటివ్ అసెస్‌మెంట్) మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడానికి ఇప్పటివరకు కేవలం ఒక్క ఎఫ్‌ఏ-1 మాత్రమే పూర్తయింది. ఈసారి రెండు ఎఫ్‌ఏలు మాత్రమే జరపాలని, రెండోదాన్ని ఏప్రిల్ 15లోపు పూర్తి చేయాలని గతంలో కాలపట్టికను నిర్ణయించారు. రెండోది జరపకుండానే పాఠశాలలను మూసివేశారు. కేవలం ఒక్క ఎఫ్‌ఏతో గ్రేడింగ్ ఇవ్వరాదని భావిస్తే.. గత ఏడాది ఏపీలో చేసినట్లుగా కేవలం ‘పాస్’ అని అందరికీ ధ్రువపత్రాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'ఏడేళ్లైనా ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం'