Covid Guidelines: ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న వేళ.. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసుల శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. మత్తు పదార్థాల కట్టడితో పాటు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేలా పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం..
దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. నూతన సంవత్సర వేడుకలతో వ్యాప్తి మరింత పెరగకుండా పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించాయి. దిల్లీ, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రకటించాయి. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించింది. కొత్త సంవత్సర వేడుకల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని ప్రజలను అప్రమత్తం చేసింది. మాస్కు ధరించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
గుంపు గుంపులుగా గుమిగూడితే..
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు సన్నద్ధమవుతున్నారు. గుంపు గుంపులుగా గుమిగూడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వేడుకలకు హాజరయ్యే వారు కరోనా నిబంధనలు పాటించేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ... 30, 31 తేదీల్లో మరింత విస్తృతంగా తనిఖీలు ఉండనున్నాయి. హైదరాబాద్‌లో పై వంతెనలతో పాటు పీవీ మార్గ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేయనున్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలతో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని పబ్‌లపై నిఘా పటిష్ఠం చేశారు.
ఇదీ చదవండి: