Telangana Government Interduce Praja Palana Scheme : పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటని తెలిసింది.
Telangana Praja Palana Scheme Details : ప్రస్తుతం హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయులకు రావాలని, ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు.
ప్రజావాణికి భారీ స్పందన- ప్రజాభవన్‌కు బారులు తీరిన ప్రజలు
Praja Palana Scheme From December 28 : గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత పది రోజుల పాటు గ్రామస్థాయిలో ‘ప్రజా పాలన(PrajaPalana)’ పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తరువాత వారానికి రెండు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని తెలిసింది.
Meeting on Government Schemes in Telangana : అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు
Ration Card Application Start December 28 : మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(Ration Card Process) జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నందున ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు సమాచారం.
ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు