కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వేతన సవరణ అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది. ఫిట్‌మెంట్‌ను 30 శాతంగా ప్రకటించడంతోపాటు పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. 12 నెలల వేతన సవరణ బకాయిలూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటిని పదవీ విరమణ ప్రయోజనాలతో అందజేస్తామని తెలిపింది. మే నెల ఒకటో తేదీన అందే ఏప్రిల్ నెల వేతనం కొత్త జీతంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో వేతన సవరణ కమిషన్ (పే రివిజన్ కమిషన్-పీఆర్సీ) సిఫార్సుల అమలుకు ఆర్థిక శాఖ వేర్వేరు ఉత్తర్వులను జారీ చేయాలి. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)కు వేర్వేరుగా జీవోలు ఇవ్వాలి. ప్రధానంగా హెచ్‌ఆర్‌ఏపై స్పష్టత రావాలి. కొత్త స్కేలు, డీఏ, సీసీఏలపైనా నిర్ణయం వెల్లడవ్వాలి. ఏప్రిల్ 20లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలి.
ప్రభుత్వం నుంచి స్పష్టత అనంతరం మరింత వేగవంతం
సవరించిన మాస్టర్‌స్కేళ్లు, డీఏ, గ్రేడ్‌ల కొనసాగింపు, 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన నిర్ణయం, ఇంక్రిమెంట్‌లు, ఏడాది పీఆర్సీ బకాయిలపై ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.
‘‘మార్గదర్శకాలను రూపొందించడం సుదీర్ఘమైన ప్రక్రియ. దీన్ని రెండు వారాల్లో పూర్తిచేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. పలు అంశాల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత అనంతరం కసరత్తు మరింత వేగవంతం అవుతుంది. ప్రభుత్వంలోనే కాకుండా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థలు, ఇతర స్వతంత్రసంస్థలకు స్పష్టత ఇవ్వాలి. సవరించిన వేతనాలు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయన్నది వివరించాలి. ప్రస్తుత వేతన స్కేలు, సవరించిన వేతనాలను స్పష్టంగా పేర్కొనాలి’’ అని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మార్గదర్శకాలు రూపొందించండి
రాష్ట్రంలో ఒప్పంద, పొరుగుసేవలు, ఇతర ఉద్యోగుల వేతనాలు 30 శాతం పెంచేలా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ నెల 22న కొత్త వేతన సవరణ విధానం కింద ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఒప్పంద, పొరుగుసేవలు, ఇతర ఉద్యోగులకు వేతనాలనూ పెంచుతామన్నారు.
సాధారణంగా పీఆర్‌సీలో ఫిట్‌మెంటు ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది. మూలవేతనం, హెచ్‌ఆర్‌ఏ, డీఏ తదితరాలు వారికే ఉంటాయి. ఒప్పంద, దినవేతన ఉద్యోగులకు జీతాలు మినహా ఇతరత్రా ఏమీ ఉండవు. దీన్ని వారికి ఎలా అమలు చేయాలో అనే సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా... ఒప్పంద తదితర ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనని, అందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 3.47 లక్షల మంది ఒప్పంద, పొరుగు సేవల, దినవేతన ఉద్యోగులున్నారు. తాత్కాలిక ఉద్యోగులకు రూ.5 వేల నుంచి 11 వేల వరకు, పొరుగు సేవల ఉద్యోగులు రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు, ఒప్పంద ఉద్యోగులు రూ. 22 వేల నుంచి రూ. 37 వేల వరకు వేతనాలు పొందుతున్నారు. వీరందరికీ ఇప్పుడు 30 శాతం చొప్పున పెరగనుంది. ఒప్పంద అధ్యాపకులు తదితర కేటగిరిల్లో శాశ్వత ఉద్యోగుల మూలవేతనాల కంటే ఎక్కువ ఉండకుండా పెంపుదల ఉంటుంది.
ఇకపై ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు
ప్రభుత్వ ఉద్యోగులతో మాదిరే ఇకపై ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకూ ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. చాలా శాఖల్లో మూడు నుంచి ఆరు నెలల వరకు వేతనాలు అందడం లేదు. రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేసే టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్లకు మూడు సంవత్సరాలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఎలాంటి జాప్యం లేకుండా బకాయిలన్నీ చెల్లిస్తూ నెలనెలా వేతనాలు చెల్లించాలని సర్కారు నిర్ణయించింది.