భూముల సమగ్ర సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూముల డిజిటల్ సర్వే చేసే కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. సీఎస్ నిర్వహించిన ప్రాథమిక స్థాయి సమావేశానికి డిజిటల్ సర్వే చేసేందుకు ఆసక్తి కనబరచిన 17 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన భూముల సర్వే సందర్భంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను వారు సమావేశంలో వివరించారు.
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్లో 400 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సోమేశ్ కుమార్ తెలిపారు. సర్వే విషయమై కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమావేశం అవుతారని చెప్పారు. భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, వ్యయం, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంటర్నెట్ సామర్థ్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: 2డీజీ డ్రగ్ వాడాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!