TS Govt Focus on GST Fraud Registrations : అక్రమ వ్యాపార లావాదేవీలను నిలువరించేందుకు, జీరో వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన జీఎస్టీ విధానంలోనూ కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడటంలో ఆరి తేరారు. నకిలీ రిజిస్ట్రేషన్లు తీసుకుని.. పైసా విలువ వ్యాపారం కూడా చేయకుండానే ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకుంటూ వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. 2017 జులై నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ విధానంలో ఎప్పటికప్పుడు లోటు పాట్లను సవరించేందుకు జీఎస్టీ కౌన్సిల్ చర్యలు తీసుకుంటూ వస్తోంది. క్షేత్రస్థాయి తనిఖీలు లేకపోవడంతో.. కొందరు వ్యాపారులు అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ జీరో వ్యాపారం చేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ.. ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారు.
ఇలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కొరఢా ఝులిపించేందుకు కేంద్రం నడుం బిగించింది. నకిలీలు, మోసపూరిత రిజిస్ట్రేషన్లుగా అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల్లో తేలితే.. వాటిని రద్దు చేయాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించింది. అత్యంత సున్నితమైనవి 47 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు ఉండగా.. తక్కువ సున్నితమైనవి మరో 26 వేల రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత సున్నితమైన 47 వేలకు పైగా మోసపూరిత, నకిలీ రిజిస్ట్రేషన్లను మూడు రకాలుగా విభజించింది. మొదటిది.. పన్నుల చెల్లింపుల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్న రిజిస్ట్రేషన్లు 6,264 ఉండగా.. దగ్గరి బంధువులు, స్నేహితుల పేర్లతో రిజిస్ట్రేషన్లు తీసుకుని పన్నులే చెల్లించకుండా తిరిగి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటున్న రిజిస్ట్రేషన్లు 38,837 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వ్యాపారుల నుంచి సరుకులు కొనుగోలు చేస్తూ ఐటీసీ తీసుకుంటున్న రిజిస్ట్రేషన్లు 1935 ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇలా మొత్తం 47,036 రిజిస్ట్రేషన్లు అత్యంత సున్నితంగా ఉన్నవిగా భావిస్తున్న అధికారులు.. వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో రాష్ట్రంలో 496 రిజిస్ట్రేషన్లు నకిలీ, మోసపూరితమైనవి ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
పూర్తి స్థాయిలో ఆరా తీసేందుకు శ్రీకారం..: దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్.. ఈ నెల 16వ తేదీ నుంచి జులై 15లోపు పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రంలోని నకిలీ, మోసపూరిత రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీసేందుకు శ్రీకారం చుట్టింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో 200కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సంబంధిత ప్రత్యేక బృందాలు.. ఇచ్చే నివేధిక ఆధారంగా చర్యలు ఉంటాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.
స్పెషల్ డ్రైవ్ యాప్ రూపకల్పన..: ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక నిఘా విభాగం.. వ్యాపార లావాదేవీల్లో అనేక రకాల అవకతవకలకు పాల్పడుతున్న 3 వేల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి.. మొదట 5 వందల రిజిస్ట్రేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. అందుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే జీఎస్టీ లైసెన్సుల పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేసింది. ఇప్పటికే హైదరాబాద్ ఐఐటీ, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కలిసి స్పెషల్ డ్రైవ్ యాప్‌ను రూపకల్పన చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్ నంబరు నమోదు చేయగానే సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలకు ఈ ప్రత్యేక యాప్ దోహదం చేస్తుందని, వేగంగా పని పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి..
15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్లో ఎంతంటే?
Online Betting Games : ఆశతో ఆన్లైన్ బెట్టింగులు.. అప్పుల కుప్పల్లో జీవితాలు