ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్ వరి సాగు విస్తీర్ణంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. బుధవారానికి అరకోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి నాట్లు వేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తెలంగాణలో రబీలో అరకోటి ఎకరాల్లో 27.12 లక్షల మంది రైతులు వరి సాగు చేయడం గత చరిత్రలో ఎన్నడూ లేదు. తెలంగాణ తరువాతి స్థానాల్లో తమిళనాడు 26 లక్షలు, ఏపీ 17.60 లక్షల ఎకరాలతో వరసగా ఉన్నాయి.
అన్నీ కలిపి 65.32 లక్షల ఎకరాల్లో..
వాస్తవానికి అన్ని పంటలు కలిపి యాసంగిలో తెలంగాణలో సాగయ్యే సాధారణ విస్తీర్ణమే 36.43 లక్షల ఎకరాలు. కానీ గత జులై నుంచి అక్టోబరు దాకా కురిసిన అధిక వర్షాలతో రిజర్వాయర్లు, చెరువులు నిండటం, భూగర్భ జలాలు పెరగడంతో ఈ సీజన్‌లో అన్ని పంటలూ కలిపి ఇప్పటికే 65.32 లక్షల ఎకరాల్లో విత్తనాలు, నాట్లు వేశారని, ఇది సరికొత్త రికార్డు అని వ్యవసాయశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.
వేరుసెనగ వంటి పంటలు వేసే వారు సైతం వరికి మొగ్గు
రాష్ట్రంలో 24.50 లక్షల వ్యవసాయ బోర్లుండగా వాటి కింద వరి నాట్లు అధికంగా వేశారు. ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీరు రావడం వల్ల వరి సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో వేరుసెనగ వంటి ఇతర పంటలు వేసే రైతులు సైతం ఈ సీజన్‌లో సాగునీటి లభ్యత కారణంగా వరి వేశారు. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్‌లో అత్యధికంగా 4.88 లక్షల ఎకరాలు, నల్గొండలో 4.78 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. అత్యల్పంగా మేడ్చల్‌లో 15,253 ఎకరాలు సాగయింది. మొత్తం 10 జిల్లాల్లో సాధారణ విస్తీర్ణంకన్నా 100 శాతానికి మించి అదనంగా సాగవడం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రత్యక్ష తరగతులకు తొలిరోజు 9 శాతం హాజరు