తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకూ....కృష్ణా యాజమాన్య బోర్డు పరిధి నోటిఫై చేయవద్దని...రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది. బోర్డు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించకుండా, ఆమోదం లేకుండా బోర్డు పరిధిని ప్రకటించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శికి తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. బోర్డులో సభ్యులైన రాష్ట్రాలను పూర్తి స్థాయిలో సంప్రదించకుండా బోర్డు పరిధిని నోటిఫై చేయవద్దని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని... రెండు అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని లేఖలో పేర్కొన్నారు. 2020 జూన్ నాలుగో తేదీన జరిగిన బోర్డు సమావేశంలో పరిధి విషయమై తమ అభ్యంతరాలను లేవనెత్తామని, తాత్కాలిక సర్దుబాటు ఆధారంగా పరిధి ఖరారు చేయవద్దని విభజనచట్టంలోని 87వ సెక్షన్ చెబుతోందని ప్రస్తావించారు. బేసిన్ వెలుపలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తోందని, దాన్ని నిరోధించి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని కృష్ణా రెండో ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నట్లు ఈఎన్సీ లేఖలో తెలిపారు.
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేశాకే బోర్డు పరిధిని ఖరారు చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన అని... విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఇదే ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బోర్డు పరిధి విషయమై తదుపరి ముందుకెళ్లవద్దని కోరింది. అటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు తరలించవద్దని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. బేసిన్‌ను కాదని కార్యాలయాన్ని దూరంగా వైజాగ్ లో ఏర్పాటు చేయడం తగదని, ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల వాస్తవ పరిస్థితి పరిశీలించేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఓ కమిటీని నియమించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కమిటీ పర్యటించి నివేదికను రూపొందించనుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశం మేరకు ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కృష్ణా బోర్డుకు సూచించింది. ఆదేశాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాస్తవ పరిస్థితిని నివేదించాలని ఎన్జీటీ సూచించింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన కృష్ణాబోర్డు కమిటీ త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్