రాష్ట్రంలో తొలిసారిగా 2018లో ప్రవేశపెట్టిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పథకం(T- Diagnostic centers) విజయవంతంగా కొనసాగుతోంది. దీని కింద గత మూడున్నరేళ్లలో 15,22,516 మంది లబ్ధిపొందగా.. మొత్తంగా 45,15,040 వేర్వేరు పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌ల్లోని ధరలతో లెక్కించగా.. సుమారు రూ. 177.98 కోట్ల విలువైన పరీక్షలను రోగులు ఉచితంగా పొందినట్లుగా వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు రోగులకు ఆర్థిక భారం తగ్గిందని తెలిపింది. సంబంధిత తాజా నివేదికను వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది.
నాలుగేళ్ల కిందట తొలిసారిగా హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఆవరణలో ‘తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని’(Telangana Diagnostic Centers) ప్రారంభించారు. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఇక్కడికి తరలించి పరీక్షిస్తున్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారి ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తీసుకుంటారు. దీంతో పరికరమే ఆన్‌లైన్‌లో రోగికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బస్తీ దవాఖానాకు ఫలితాలను పంపిస్తుంది.
హైదరాబాద్‌లో ఈ విధానం విజయవంతం కావడంతో.. మూడు నెలల కిందటే మరో 19 జిల్లాల్లోనూ అత్యాధునిక టి-డయాగ్నొస్టిక్ కేంద్రాలను, రాజధానిలో కొత్తగా 8 రేడియాలజీ పరీక్షల కేంద్రాలను స్థాపించారు. తద్వారా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటిల్లోనూ పథకం అద్భుత ఫలితాలు సాధిస్తుండటంతో.. రాష్ట్రంలో మరో 13చోట్ల తెలంగాణ డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను, 12 చోట్ల రేడియాలజీ హబ్‌లను కూడా త్వరలో ప్రారంభించడానికి వైద్యారోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే సేవలందిస్తోన్న టి-డయాగ్నొస్టిక్ హబ్స్..
హైదరాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో టి- డయాగ్నొస్టిక్ హబ్స్(T- Diagnostic hubs) సేవలందిస్తున్నాయి.
కొత్తగా ప్రారంభించనున్న తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఇవే..
జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నూతనంగా ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్‌లో రేడియాలజీ హబ్స్..
అంబర్‌పేట, లాలాపేట, సీతాఫల్‌మండి, శ్రీరాంనగర్, బార్కాస్, జంగమ్‌మెట్, పానీపూరా, పురానాఫుల్ ప్రాంతాల్లో రేడియాలజీ హబ్స్(Radiology hubs) అందుబాటులో ఉన్నాయి.
త్వరలో ప్రారంభించనున్న హబ్స్..
హయత్‌నగర్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, నార్సింగి, శేరిలింగంపల్లి, మలక్‌పేట, అమీర్‌పేట, ఉప్పల్, కుషాయిగూడ, కూకట్‌పల్లి, గోల్కొండ, ఆల్వాల్‌లో త్వరలో ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: Electric vehicles: సర్కార్ ప్రోత్సాహం... పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు