DGP Anjanikumar Review Meeting: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, డీఎస్పీలతో డీజీపీ అంజినీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. ఏదైనా కేసు దర్యాప్తు చేసే క్రమంలో మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వాళ్లను హింసించడం, లాకప్ డెత్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సహించేది లేదని అంజనీ కుమార్ హెచ్చరించారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా.. పోలీసులు దర్యాప్తులో ఉపయోగపడే విధంగా ఆధారాలు సేకరించాలని అన్నారు. సాంకేతికత ఉపయోగించుకొని కేసు దర్యాప్తు ఉండాలని సూచించారు. ఇదే సమయంలో పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుడికి సరైన గౌరవం దక్కకపోతే సాంకేతికత ఎంత పెరిగినా లాభం లేదని అంజనీ కుమార్ గుర్తు చేశారు. దర్యాప్తు వేగవంతంగా జరగడానికి వైజ్ఞానిక, శాస్త్రీయ ఆధారాలు ఎంతో ఉపయోగపడతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మాట్లాడిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయల్.. చిన్నారులపై లైంగిక దాడుల విషయంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో గతేడాది జనవరి వరకు 7 వేల 186 కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2 వేల 43 కేసుల వరకు తగ్గించామని ఆమె తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ అధికారులను, సిబ్బందిని డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొని పోలీసులకు తగు సూచనలు చేశారు.
జైళ్ల శాఖకు మూడో ర్యాంక్: మరోవైపు.. తెలంగాణ జైళ్ల శాఖ దేశంలో మూడో స్థానం సంపాదించడం పట్ల హోంమంత్రి మహమూద్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. ముంబయికి చెందిన టీఐఎస్ఎస్ ఇతర సంస్థలతో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ నివేదిక వచ్చిందని ప్రకటించారు. నూతన సచివాలయంలో జైళ్లు మరియు సంస్కరణల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ జితేందర్, జైళ్ల శాఖ డీఐజీలు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
జైళ్ల శాఖ పని తీరు, శాఖలో నెలకొల్పిన పారిశ్రామిక యూనిట్లు, శాఖ ఆధ్వర్యంలో ఉన్న పెట్రోల్ బంకులు, ఖైదీలకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, జైళ్ల శాఖకు సంబంధించిన మెజిస్టీరియల్ విచారణల తీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. శిక్షా కాలం పూర్తైన తర్వాత ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకులలో ఉద్యోగం కల్పించడం మంచి విధానమని ఆయన అన్నారు.
ఇవీ చదవండి:
Chikoti Praveen News : థాయ్‌లాండ్‌లో 'చీకోటి' గ్యాంబ్లింగ్‌పై నిఘా
Job Fraud: డేటా ఎంట్రీ జాబ్ ఇస్తామంటూ.. నిరుద్యోగులకు టోకరా