Telangana Congress MLA Candidates List 2023 : కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యర్ధుల ఎంపికలో సరియైన ప్రమాణాలు పాటించకపోవడం, ఆలస్యంగా అభ్యర్ధులను ప్రకటించడం వల్లనే ఆశించిన స్థానాలను దక్కించుకోలేకపోయామన్న భావన తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఉంది. ఈసారి ఆలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పీసీసీతో పాటు ఏఐసీసీ కూడా జాగ్రత్త పడుతోంది. అభ్యర్ధుల ఎంపికనే కీలకంగా భావిస్తున్న పార్టీ అధిష్ఠానం.. లోతైన కసరత్తు చేస్తోంది.
Congress MLA Candidates List Telangana 2023 : ఇటీవల దిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు వ్యవహరించిన తీరు, నాయకుల మధ్య కీచులాటతో పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. సునీల్ కనుగోలు సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో ఒకరిద్దరు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి అనుకూలమైన సర్వేలు ఉంటాయని కూడా ఎత్తిచూపినట్లు సమాచారం. దీంతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్.. గెలిచే అవకాశం లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
Telangana Congress MLA Candidates Selection : సామాజిక న్యాయాన్ని పాటిస్తూనే గెలుపు గుర్రాలకే పోటీ చేసే అవకాశం కల్పించాలని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు బలమైన వారైతే వారినే బరిలో దింపాలని కూడా పీసీసీకి సూచించినట్లు తెలుస్తోంది. అది కూడా విమర్శలు తలెత్తని విధంగా పక్కా సర్వేలు నిర్వహించి జనాధరణ కలిగిన వారికే అవకాశం ఇవ్వాలని, ఆలా అయితేనే విమర్శలకు అవకాశం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదరిని, సముజ్జీలు కలిగిన 22 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహిస్తున్నారు. సునీల్ కనుగోలు బృందంతోపాటు మరొక బృందం కూడా ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆ సర్వేలకు సంబంధించి వివరాలు ఏఐసీసీకి చేరనున్నట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 : స్క్రీనింగ్ కమిటీ మొదట ఇవాళ సమావేశం కావాలని భావించినప్పటికీ.. ప్లాష్ సర్వేల సమాచారం రావడానికి ఆలస్యం కావడం, గట్టి పోటీ కలిగిన నియోజకవర్గాలకు చెందిన నాయకల సమాచారం సేకరణకు సమయం పడుతుండడం లాంటి అంశాలతో వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్టోబరు మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి విడత జాబితాకు సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వనుంది సీఈసీ సమావేశమైన రోజు లేదా.. మరుసటి రోజు మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.