Telangana Congress Operation Akarsh : ఇద్దరు పెద్ద నేతలతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరతారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, వారి అనుచరులు ఏకంగా 35 మంది కాంగ్రెస్‌లో చేరతామని అధికారికంగా ప్రకటించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో.. రాష్ట్రంలో గ్రాఫ్ భారీగా పెరిగినట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ప్రజలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు.. క్షేత్రస్థాయి పరిస్థితి చెబుతోందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా పెద్ద నాయకులు కాకపోయినా.. చిన్న చిన్న నాయకులు తరచూ పీసీసీ సమక్షంలో చేరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పీసీసీ సర్వేలు చేయించగా.. రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ బలపడినట్లు స్పష్టమైంది.
Ponguleti Srinivas Reddy Congress : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెరో 45 స్థానాలు దక్కుతాయని.. బీజేపీ, ఎంఐఎంలకు చెరో ఏడు స్థానాలు దక్కుతాయని, మరో 15 చోట్ల పోటాపోటీగా ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ఎన్నికల ముందు పార్టీలో పరిస్థితి, ఇప్పటికి పూర్తిగా భిన్నంగా ఉందని.. కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. తాజాగా పొంగులేటి, జూపల్లిలతో కలిసి 35 మంది కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఏఐసీసీ పేర్ల జాబితా విడుదల చేసింది. వారు కాకుండా చాలా మంది బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చర్చలు కొలిక్కి వచ్చే వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
Jupalli Krishna Rao Joins Congress : మరింత సన్నిహితంగా, విషయాలను గోప్యంగా ఉంచే నాయకుల ద్వారా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నారు. మల్లురవి వంటి నాయకులు కొందరిని ఎంపిక చేసి.. వారి ద్వారా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే వారితో మాట్లాడిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ కాంగ్రెస్ వైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు వచ్చే అవకాశం ఉందని అంచనా. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వచ్చే నెల 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ సభలోనే రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కంటే ఎక్కువ మంది ఆ సభకు వస్తారని పొంగులేటి సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేయడంతో పదవులను వదిలి ఉద్యమంలో పాల్గొన్నామని జూపల్లి స్పష్టం చేశారు. రాష్ట్రం వచ్చాక తమ అంచనాలు పూర్తిగా పట్టు తప్పాయని.. కేసీఆర్ పాలన అంతా బోగస్ మాటలు, పథకాలతో ముందుకెళుతోందని ధ్వజమెత్తారు. ఏదేమైనా కాంగ్రెస్‌కు రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో చేరికలు మరింత పెరుగుతాయని పీసీసీ అంచనా వేస్తోంది. ఆ ఇద్దరు పెద్ద నాయకులు పార్టీలో చేరిన తర్వాత పార్టీలో మరింత మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తోంది.
ఇవీ చూడండి..
Revanthreddy fires on CM KCR : 'ప్రజలను మోసం చేయడంలో... బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్'
T Congress Leaders Delhi Tour : దిల్లీకి కాంగ్రెస్ నేతలు.. జగ్గారెడ్డికి దక్కని ఆహ్వానం