CM KCR BIRTH DAY: ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టిన రోజును తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు.. ఈ నెల 15 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాయి. అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడం వంటి.. సామాజిక కార్యక్రమాల్లో నేతలు పాల్గొంటున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దివ్యాంగులకు కేటీఆర్ మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయనున్నారు.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో కేసీఆర్ కప్ వాలీబాల్ పోటీలు నిర్వహించిన తెలంగాణ జాగృతి.. బహుమతులు ప్రదానం చేసింది. రాత్రి 12 గంటలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత కేక్ కోశారు. కవిత మధ్యాహ్నం తిరుమలలో మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారికి పూజలు చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేక్ కోశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక గీతం..
కేసీఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో ప్రత్యేక గీతం రూపొందించారు. ఆ గీతాన్ని బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. అహర్నిశలు పోరాడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు బంగారు తెలంగాణ చేశారని నేతలు పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు.
రూపాయికే 'గులాబీ దోశలు'..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గులాబీ రంగులో వేసిన దోశలు ఆకట్టుకున్నాయి. రూపాయికే దోశ ఇవ్వటంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కరీంనగర్లో కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. సీఎం శిల్పాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని శిల్పి సత్యం పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ తెరాస నాయకులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్, యాదాద్రి జిల్లా భువనగిరి, మెదక్ జిల్లా నర్సాపూర్ సహా పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
ఇదీ చూడండి: CM KCR Mumbai Tour : 'సరైన సమయంలో గళం విప్పారు'.. సీఎం కేసీఆర్‌కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్