ఆర్టీసీ అంశమే ప్రధానంగా తెలంగాణ మంత్రివర్గం గురువారం భేటీ కానుంది. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరవతామని ప్రకటించడం, తొలగించిన ఉద్యోగుల అంశాన్ని హైకోర్టు.. కార్మిక న్యాయస్థానానికి అప్పగించిన నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై చర్చిచేందుకు ఈ సమావేశం జరగనుంది.
ఇవాళ్టి ఆందోళనలపై ప్రధానంగా చర్చ
కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేయడం, ఆ తర్వాత విరమణ ప్రకటన, హైకోర్టు ఆదేశాలు, తదుపరి పరిణామాలపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కార్మికశాఖ కమిషనర్ వద్ద ప్రక్రియ పూర్తయ్యే లోపు విధుల్లోకి తీసుకునేది లేదని ఆర్టీసీ ఎండీ ప్రకటన తరువాత ఉత్పన్నమైన పరిస్థితులు, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చిస్తారు.
రూట్ల ప్రైవేటీకరణపై తుది నిర్ణయం
ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రులందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. అటు ప్రైవేట్ బస్సులకు అనుమతుల విషయమై కూడా చర్చకు రానుంది. 5100 ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు ఇప్పటికే మంత్రివర్గం తీర్మానం చేసింది. రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి రవాణాశాఖ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయమై కూడా కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనసభ సమావేశాలపై కూడా చర్చ...!
అటు కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు శాసనసభ సమావేశాల నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు ఇతర పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్