Telangana Budget 2024-25 : రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 బడ్జెట్ (Budget 2024-2025) కోసం అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. ఇందులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహించనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం సమీక్షిస్తారు.
Telangana Govt Exercise on Budget 2024 : తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖల సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. 19న సీతక్క, దామోదర రాజనర్సింహ కు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు నిర్వహిస్తున్న శాఖల ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సమీక్షిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖకు చెందిన శాఖల సమావేశాలు 22న జరుగుతాయి. 23న పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది.
రాష్ట్ర బడ్జెట్ 2024-25పై ఉత్కంఠ - ఓటాన్ అకౌంట్‌కు వెళతారా? పూర్తి బడ్జెట్ పెడతారా?
24 నుంచి సీఎం వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయి. మూడు రోజుల్లో రోజుకు నాలుగు చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు. అన్ని శాఖలు ఇప్పటికే ఆర్థికశాఖకు ఇచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు విడిగా ఇవ్వాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు సూచించింది. ఆయా పథకాలకు అవసరమయ్యే నిధులు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రత్యేకంగా తయారు చేయాలని సంబంధిత శాఖల సమీక్ష సందర్భంగా వాటిపై చర్చించాలని తెలిపింది.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం
మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రానుంది. తెలంగాణ బడ్జెట్‌ను ఆ తర్వాతే ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత రానుంది. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు ఖరారు చేశారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని సీఎం అధికారులను కోరారు. దీంతో తప్పనిసరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?
నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!