BJP Leaders on Bandi Sanjay Arrest: చట్టాలు, నిబంధనలు కేవలం ప్రతిపక్షాల పార్టీల కోసమే అన్నట్లు అమలు చేస్తున్నారని భాజపా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేయడమే గాక అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. అరెస్టులకు భయపడబోమని... జీవో 317పై ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు.
'పోలీసులు సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. మూడేళ్లలో ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. మూడేళ్లుగా సీఎం కేసీఆర్ కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. జీవో 317పై ఉద్యోగుల్లో చాలా ఆందోళన నెలకొంది. ఉద్యోగుల ఆందోళనను సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదు. బదిలీలపై ఆందోళనతో కొంతమంది ఉద్యోగుల గుండెలు ఆగాయి. కేసీఆర్ చక్రవర్తి తరహాలో ఎవరి గోడూ పట్టించుకోవట్లేదు. సంజయ్ దీక్ష విషయంలో సీపీ దారుణంగా వ్యవహరించారు. భారత్, పాక్ యుద్ధం తరహా పరిస్థితి తీసుకొచ్చారు. తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేశారు. మేమంతా ఉద్యోగుల వెంటే ఉంటాం. నిర్బంధం, అక్రమ అరెస్టులు ఎక్కువ రోజులు సాగదు. బేషరతుగా బండి సంజయ్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.' -- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఆయన తీరే వివాదాస్పదం..
కరీంనగర్ సీపీ తీరు ఆదినుంచి వివాదస్పదంగానే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు.
'కరీంనగర్ సీపీ తీరు వివాదాస్పదంగా ఉంది. కిషన్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగినా పట్టించుకోలేదు. అసదుద్దీన్ వేలమందితో సమావేశాలు పెడుతున్నారు. డీజీపీ.. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్ ఐపీసీలు రాసుకోవాలి. డీజీపీ ఖాకీ తీసేసి గులాబీ యూనిఫాం వేసుకోవాలి. సంజయ్‌ను అరెస్టు చేసినప్పుడు పోలీసులకు మాస్కులు లేవు. ఉద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తాం. జీవో 317కు సవరణ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం.'
--రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
మీకు వర్తించవా?
రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే భయంతోనే తెరాస ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని విజయశాంతి ఆరోపించారు. వరిధాన్యం లేదంటే ఉద్యోగాలు అది కాకపోతే నిరుద్యోగుల సమస్య... ఇలా ఏదోఒకటి తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. తెరాస పాలనలో ఆత్మహత్యలు పెరిగిపోయాయని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ వర్గం వాళ్లు కూడా సంతోషంగా లేరని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
'మీరు నిబంధనలు పెట్టుకున్నప్పుడు అప్పుడు కొవిడ్ లేదా? కేసీఆర్ పెట్టినప్పుడు అప్పుడు నిబంధనలు లేవా? డిసెంబర్ 31న మీరంతా కొవిడ్ నిబంధనలు పాటించారా? చెప్పండి ఏం చేస్తున్నారో? మీరు ఫ్లైఓవర్ల ఓపెన్ చేసినప్పుడు కొవిడ్ నిబంధనలు లేవా? అంటే భాజపా విషయానికి వచ్చే సరికే కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయా?'
-- విజయశాంతి, భాజపా నేత
ఇవీ చూడండి:
Bandi Sanjay: బండి సంజయ్‌కు బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్
BJP Jagarana deeksha : 'నిద్రపోతున్న సర్కారును మేల్కొల్పేందుకే జాగరణ దీక్ష'