KTR Davos Tour: దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. రాష్ట్రంలో 1400 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుండాయ్ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుండాయ్ సీఐఓ యంగ్చోచి ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇకో సిస్టమ్ అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు హ్యుండాయ్ సంస్థ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపై కూడా యంగ్చోచి మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండాయ్ సంస్థ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్న ఆయన... అందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చిన హ్యుండాయ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
పెట్టుబడుల వెల్లువ: హైదరాబాద్‌లో గ్లాస్-లైన్ పరికరాల తయారీ కోసం విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన జీఎంఎం ఫాడులర్ సంస్థ.. మరో 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి ఆసక్తి కనబర్చింది. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండేళ్ల క్రితం 6.3 మిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌కు మరో 37 లక్షల డాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరనుంది. ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము భారతదేశం వైపు చూస్తున్నామన్న థామస్ కెహ్ల్... హైదరాబాదీ కేంద్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. స్వీడన్‌కు చెందిన ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ సంస్థ క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. టీబీ డయాగ్నోస్టిక్ కిట్‌లను తయారుచేసేందుకు గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం: రాష్ట్రంలో డిజిటైజేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్ సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ కార్డుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్, మాస్టర్ కార్డు సంస్థ ఉపాధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమాన్ సమక్షంలో ఒప్పందాన్ని ప్రకటించారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా పౌరులకు ప్రపంచ స్థాయి సేవలు అందించే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రాధాన్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డిజిటైజేషన్ కు మాస్టర్ కార్డు పనిచేయనుంది.
ఇన్నోవేషన్ రంగంపై చర్చాగోష్టిలో పాల్గొన్న కేటీఆర్: భారతదేశ శీఘ్రప్రగతికి ఇన్నోవేషన్ రంగం బలోపేతమే సత్వరమార్గమని కేటీఆర్ అన్నారు. భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో జరిగిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. దేశంలో స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం దిశగా తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు. దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాలంటే ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇన్నోవేషన్ రంగానికి సహకారం అవసరం: భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని వేగంగా ముందుకు పోవాలంటే ఇన్నోవేట్, ఇంకుబేట్, ఇంకార్పేట్ అనే త్రీఐ మంత్రమే మార్గమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ను మరింతగా పెంచేందుకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఒక ఎనేబులర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నమ్మిన ఆలోచనను పట్టుకొని తమ స్టార్టప్ కోసం నిబద్ధతతో సంవత్సరాల తరబడి పని చేయడం ఒక అద్భుతమైన పని అని కేటీఆర్ అన్నారు. 95 శాతం స్టార్టప్‌లు విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ నూతన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ టీహబ్ నిర్మాణంతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్న కేటీఆర్... ఇన్నోవేషన్ సెల్ ద్వారా బడి పిల్లల వయసు నుంచే ఇన్నోవేషన్ పైన అవగాహన కల్పించడం, నైపుణ్యం ఉన్న విద్యార్థులకు సహకారం అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్: తెలంగాణలో ఇన్నోవేషన్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన ప్రయత్నాలు, ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయన్న ఆయన... హైదరాబాద్ కేంద్రంగా వేదికగా స్టార్టప్స్ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇన్నోవేషన్ ఎనేబ్లింగ్ కార్యక్రమాలతో భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్‌లకు రాజధానిగా మారుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: